
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యత్వం విషయంలో తమకు ఇచ్చిన నోటీసుకు జవాబు ఇచ్చేందుకు మరింత గడువు కావాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీలు రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్.భూపతిరెడ్డి కోరారు. అన్ని అంశాలను పరిశీలించి వివరణ ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలని టీఆర్‌ఎస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చైర్మన్ ఈ నెల 18న నోటీసులు జారీ చేశారు. ఒక పార్టీలో చేరి వేరే పార్టీలోకి వెళ్లారన్న ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ నెల 26లోపు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలు కొండా మురళీ, ఆర్.భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, రాములునాయక్‌లను చైర్మన్ లిఖిత పూర్వక వివరణ కోరారు.
టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరినందుకు సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొండా మురళీ రాజీనామా చేశారు. మిగిలిన ముగ్గురి విషయంలో చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.యాదవరెడ్డి విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోబోరని సమాచారం. మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో పాటు మరో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మార్చితో ఖాళీ అవుతున్నాయి. ఆరు సీట్లకు ఎన్నికలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్థానం ఖాళీ అయితే అప్పుడు కాంగ్రెస్ కచ్చితంగా ఒక స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్చిలోపు యాదవరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు ఉండబోవని తెలుస్తోంది.