సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, కె.యాదగిరిరెడ్డిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే ఫిర్యాదుతో వారిపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. చట్ట నిబంధనలకు లోబడే మండలి అనర్హత నిర్ణయం ఉందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేదేమీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రాములు నాయక్, యాదగిరిరెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. గవర్నర్ నామినేట్ చేసిన చట్టసభ సభ్యులకు పార్టీలతో సంబంధం ఉండదని, తమకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదన్న నాయక్ వాదనను ధర్మాసనం ఆమోదించలేదు.
నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడండి..
ఈ తీర్పు నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజుల పాటు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఈసీ తరఫు న్యాయవాదిని కోరింది. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని ఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ చెప్పారు. వచ్చే సోమవారం (15) వరకు నోటిఫికేషన్ రాకుండా చూసేందుకు ఆస్కారం ఉందో చూడాలని ధర్మాసనం ఈసీకి సూచించింది. అనర్హతపై తీర్పు చెప్పాక ఆతీర్పు అమలుకు విరుద్ధంగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా జారీ చేయగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదిలా ఉండగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 10(8)లో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లకు విశేషాధికారాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా తనపై అనర్హత వేటు వేయడం చెల్లదని భూపతిరెడ్డి రాజ్యాంగాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment