సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెడుతూనే.. మరోవైపు ఇతర పార్టీలలో పేరున్న నేతలకు గాలంవేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకొని ప్రత్యర్థులను దెబ్బకొట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చింది.
ఇంతటితో ఆగకుండా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల్లోని బడా లీడర్లకు గాలం వేసే పనిలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ కేంద్ర మంతి సర్వే సత్యనారాయణ, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో మంతనాలు జరిపిన బీజేపీ నేతలు.. తాజాగా తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మెన్, టీఆర్‌ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్‌ని పార్టీలోకి తీసుకొచ్చుందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
(చదవండి : బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్, సర్వే సత్యనారాయణ!)
శనివారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే స్వామి గౌడ్ మాత్రం పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వలేదు. ‘పార్టీ మారితే చెప్పే మారుతా.బీజేపీ నేతలతో కేవలం ఆత్మీయ కలయిక మాత్రమే. స్నేహితులను కలిశాను. అది కూడా తప్పేనా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
(చదవండి : రూ.10 వేలను అడ్డుకొని రూ.25 వేలు ఎలా ఇస్తారు?)
అయితే బీజేపీ నేతలు మాత్రం స్వామిగౌడ్ తమ పార్టీలో చేరబోతున్నట్లు పరోక్షంగా చెబుతున్నారు. భేటీ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్వామిగౌడ్‌తో తమది స్నేహపూర్వక భేటీ అంటునే.. ఏదైనా ఉంటే భవిష్యత్తులో చెప్తామని స్వామిగౌడ్ చేరికను పరోక్షంగా అంగీకరించారు. ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. స్వామిగౌడ్‌కు టీఆర్‌ఎస్‌లో అన్యాయం జరిగిందన్నారు. స్వామిగౌడ్ హిందుత్వ భావాజాలం ఉన్నవ్యక్తి అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో అనేకమంది పార్టీలోకి వస్తారని, అందరికి కలుపుకొని పార్టీని మరింత బలేపేతం చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment