సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అసమ్మతి నేతలకు చెక్‌పెట్టడంపై టీఆర్‌ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ కోసం పని చేసిన వారిపై ఒక్కసారిగా కఠిన చర్యలు తీసుకునే బదులు అసమ్మతి నేతలతో చర్చలు జరిపి పార్టీ కోసం పని చేసేలా చివరి వరకు ప్రయత్నించాలని భావిస్తోంది. అప్పటికీ వారు దారికి రాకుంటే చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. టికెట్ ఆశించి భంగపడిన వారితో చర్చలు జరిపాలన్న కేసీఆర్ ఆదేశంతో మంత్రి కేటీఆర్ నెల రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఐదారు నియోజకవర్గాలు మినహా అసమ్మతి, అసంతృప్త నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించారు.
ప్రస్తుత అభ్యర్థిని మార్చి తమకు అవకాశం ఇవ్వాలని, లేనిపక్షంలో కచ్చితంగా పోటీ చేస్తామని చెబుతున్న ఐదారుగురు నేతలు మాత్రం కేటీఆర్‌తో చర్చలకు రాలేదు. దీంతో వారి విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంకా ప్రయత్నాలు కొనసాగించాలని, చివరి అస్త్రంగానే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత నిర్ణయించారు. నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న ద్వితీయశ్రేణి నేతలను పార్టీ కోసం పని చేసేలా ఒప్పించాలని ఎన్నికల అభ్యర్థులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలను స్వయంగా కలసి పార్టీ కోసం పని చేయాలంటూ కోరాలని సూచించారు.
గ్రామాలవారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు ముగిసిన తర్వాతే ప్రచారాన్ని ఉధృతం చేయాలని అభ్యర్థులను ఆదేశించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సమాచారం సేకరించి ప్రచారంలో దీనిపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని సూచించారు. గ్రామస్థాయి ముఖ్య నేతలతో నిర్వహించే సమావేశాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎన్నికల్లో పరిస్థితులపై వచ్చే అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయని కేసీఆర్ పలువురు అభ్యర్థులను అడుగుతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఒకరికి చొప్పున ఫోన్ చేసి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
వరుస భేటీలు...
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 6న ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం మందికి అవకాశాలు ఇవ్వడంతో దాదాపు 30 నియోజకవర్గాల్లోని నేతల్లో అసమ్మతి, అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. అభ్యర్థులను మార్చాలని కొందరు, తమకే అవకాశం ఇవ్వాలని మరికొందరు నాయకులు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అధికారిక అభ్యర్థులకు పోటీగా కార్యక్రమాలు జరగడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అనంతరం మంత్రి కేటీఆర్ చొరవతో అసమ్మతి, అసంతృప్తి కార్యక్రమాలు మెల్లగా తగ్గుముఖం పట్టాయి.
నియోజకవర్గస్థాయి నేతల విషయంలో ఇలా జరిగినా... గ్రామ, మండలస్థాయి నేతలు అసంతృప్తితో ఉన్నట్లు అధిష్టానం సేకరించిన సమాచారంలో తేలింది. దీంతో అభ్యర్థులు ప్రచారంకంటే ముందుగా అలాంటి వారందరినీ బుజ్జగించి పార్టీ దారిలోకి తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాలవారీగా ముఖ్యనేతలను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆయా గ్రామాల్లోని పెండింగ్ సమస్యలను తెలుసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌లో అవకాశాలపరంగా అసంతృప్తితో ఉన్న నేతలకు హామీలు ఇస్తున్నారు. భవిష్యత్తులో పదవుల విషయంలో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేలోగా గ్రామాలవారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు పూర్తి చేయడం వల్ల అనుకూల పరిస్థితులు ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు.
ఆఖరి అస్త్రంగా బహిష్కరణ...
టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా లేదా పోటీగా కార్యకలాపాలు నిర్వహించే నేతలపై కఠినంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ ముందుగా నిర్ణయించింది. సెప్టెంబర్ 3న మునుగోడు నియోజకవర్గ అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై బహిష్కరణ వేటు వేసింది. ఉమ్మడి నల్లగొండలో బహిరంగ సభ నిర్వహణకు ఒకరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతల విషయంలోనూ ఇదే తరహా నిర్ణయాలు వెంటనే జరుగుతాయని టీఆర్‌ఎస్ అభ్య ర్థులు భావించారు. దీనివల్ల నియోజకవర్గాల్లో ఇబ్బందులు తప్పుతాయనుకున్నారు.
అయితే అసమ్మతులపై కఠిన చర్యల కంటే వారిని దారికి తెచ్చుకోవడమే మంచిదని సర్వేలు, నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో అన్ని స్థాయిల్లో సమావేశాలు, బుజ్జగింపుల తర్వాతే బహిష్కరణ నిర్ణయం తీసుకోవాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో అధిక శాతం అసమ్మతి, అసంతృప్త నేతలు పార్టీ దారిలోకి వచ్చారని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. గరిష్టంగా నాలుగైదు సెగ్మెంట్లలోనే అధికారిక అభ్యర్థులకు పోటీగా కొందరు ప్రచారం చేస్తున్నారని నిర్ధారించుకుంది.
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే రెబెల్ అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు వేచి చూసినా పార్టీకి వచ్చే నష్టం ఉండదని నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకా రం కోరుకంటి చందర్ (రామగుండం), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), రాజారపు ప్రతాప్ (స్టేషన్ ఘన్‌పూర్) టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పోటీగా బరిలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి విషయంలోనూ చివరి వరకు వేచి చూసే ధోరణిలో పార్టీ అధిష్టానం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment