సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఖైరతాబాద్ పీటముడి క్రమంగా బిగుస్తోంది. మాజీ మంత్రి దానం నాగేందర్‌కు గోషామహల్ టికెట్ దాదాపు ఖరారు చేసినా, ఆయన ఆ నియోజకవర్గానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. పోటీ అంటూ చేస్తే ఖైరతాబాద్‌లోనేననిసంకేతాలిచ్చారు. దీంతో ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల వద్ద అభయం పొందిన కార్పొరేటర్లు విజయారెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డిలు ఎవరికి వారు టికెట్ తనకంటే తనకేనన్న ధీమాతో ఉన్నారు. త్వరలోటీఆర్‌ఎస్ విడుదల చేసే రెండవ జాబితాలో నీ పేరే ఉంటుందని విజయారెడ్డికి పార్టీ ముఖ్యనేతలు భరోసా ఇవ్వటంతో ఆమె తన ఎన్నికల ప్రచారానికి వ్యూహాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు.
నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి సైతం పార్టీ భరోసాతోనే ఇంటింటికీ టీఆర్‌ఎస్ కార్యక్రమాన్నివిస్తృతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా దానం నాగేందర్ గోషామహల్‌కు తాను వెళ్లేది లేదని పేర్కొంటూ ఖైతరాబాద్‌లోనే విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల వినాయక మండపాలను సందర్శించి తానే వస్తున్నానని సంకేతాలివ్వటం, గత మూడు రోజులుగా పార్టీ ముఖ్యనేతలను కలుస్తూ, తన నివాసంలో వివిధ సంఘాలతో సమావేశమవుతూ ఖైరతాబాద్ నుండే పోటీ చేస్తున్నానని బాహాటంగానే పేర్కొంటున్న అంశం నియోకజవర్గంలో పూర్తి గందరగోళానికి దారితీస్తోంది. ఇదే విషయమై విజయారెడ్డి సైతం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తనకు పార్టీ ముఖ్య నాయకులు ఇచ్చిన హామీపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. దానం నాగేందర్ వ్యవహారశైలి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను ఆయోమయానికి గురి చేస్తుందంటూ ఆమె ఫిర్యాదులకు సిద్ధమవుతున్నారు. ఇక ఖైరతాబాద్ టికెట్‌ను కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా ఆశించినప్పటికీ ఆమెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వటం సాధ్యపడదని, అదే హోదాతో మరో ముఖ్యమైన పదవి కట్టబెట్టే ఆలోచన చేస్తామని పార్టీ ముఖ్య నేత భరోసా ఇచ్చారని తెలిసింది.
పోటీ తప్పదని సంకేతాలు
ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా తాము తప్పక బరిలో ఉంటామన్న సంకేతాలు ముగ్గురు నాయకులూ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం నేతల మద్దతు కూడకట్టిన దానం నాగేందర్ టీఆర్‌ఎస్ టికెట్ తనకే వస్తుందని, ఇక్కడి నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తుండగా, విజయారెడ్డి సైతం తాను బరిలో ఉండటం ఖాయమని కార్యకర్తల వద్ద తేల్చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి గోవర్ధన్‌రెడ్డి సైతం పార్టీ వెంట నడిచిన వారికి నష్టం చేయరని, తానే అభ్యర్థి అవుతానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఐతే పార్టీ అభ్యర్థిని ప్రకటించే అంశం ఆలస్యం చేస్తున్న కొద్ది..ముగ్గురి మధ్య విబేధాలు, వివాదాలు పెరిగిపోతున్నాయని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment