జెడ్పీలపై టీఆర్‌ఎస్‌ నజర్‌  | TRS New Target Win All 32 Zilla Parishad | Sakshi
Sakshi News home page

జెడ్పీలపై టీఆర్‌ఎస్‌ నజర్‌ 

Published Thu, May 30 2019 2:55 AM | Last Updated on Thu, May 30 2019 4:18 AM

TRS New Target Win All 32 Zilla Parishad - Sakshi

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల్లో పాగా వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను కైవసం చేసే ఉద్దేశంతో వ్యూహం రచిస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. అనంతరం అన్ని జెడ్పీ, ఎంపీపీలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తోంది. ఎంపీపీలను గెలుచుకునే బాధ్యతను ఎమ్మెల్యేలకు, జెడ్పీలు గెలిచే బాధ్యతను ఉమ్మడి జిల్లాల మంత్రులకు అప్పగించింది. ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పని చేసి అన్ని పదవులను టీఆర్‌ఎస్‌ గెలుచుకునేలా వ్యవహరించాలని అధిష్టానం సూచించింది. అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రుల ఆధ్వర్యంలో ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారికి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి దక్కేలా, ఈ ఎన్నిక వ్యవహారాన్ని సాఫీగా పూర్తి చేసేందుకు ప్రతీ జిల్లాకు పార్టీ తరఫున ఓ ఇన్‌చార్జీని నియమిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాలకు పార్టీ తరఫున ప్రత్యేకంగాఇన్‌చార్జీలను నియమించారు. మిగిలిన జిల్లాలకు ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలోని ఎంపీటీసీలను సమన్వయపరిచాలని కేటీఆర్‌ ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి బాధ్యత అప్పగించారు. అలాగే గెలిచిన జెడ్పీటీసీలను వెంటనే మంత్రులు సమన్వయం చేసి జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక సాఫీగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 158 ఎంపీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 4 జెడ్పీటీసీ స్థానాలను, 152 ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. పోలింగ్‌ జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు జూన్‌ 4 వెల్లడికానున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలను సమన్వయం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మంత్రుల ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సభ్యుల సమన్వయ ప్రక్రియ జరగనుంది.  


వరంగల్, మహబూబాబాద్‌ నేతలకు కేటీఆర్‌ అభినందనలు... 
లోక్‌సభ ఎన్నికల్లో బాగా పని చేశారని ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించారు. వరంగల్‌ లోక్‌సభలో పసునూరి దయాకర్‌ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారని, మహబూబాబాద్‌లో మాలోతు కవిత మంచి ఆధిక్యంతో గెలిచారని అన్నారు. ఈ స్థానాల ఇన్‌చార్జీగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేయడం వల్లే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారన్నారు. పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్‌. రెడ్యానాయక్, టి.రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, బి.శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు హరిప్రియ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బి.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ తదితరులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించేలా అంతా సమన్వయంతో పని చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. అన్ని జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ పదవులు టీఆర్‌ఎస్‌ వారే ఎన్నికయ్యేలా వ్యూహం అమలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలకు ఇన్‌చార్జీలను నియమించారు. వరంగల్‌ అర్భన్‌–గుండా ప్రకాశ్‌రావు/దాస్యం వినయభాస్కర్, వరంగల్‌ రూరల్‌–పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జనగామ–బోడికుంటి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌–నాగుర్ల వెంకటేశ్వర్లు, ములుగు–నన్నపునేని నరేందర్, భూపాలపల్లి–బండా ప్రకాశ్‌ను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు టీఆర్‌ఎస్‌ ప్రకటన జారీ చేసింది.

జెడ్పీలపై అధిష్టాన నిర్ణయం... 
మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఆయా ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే పూర్తి చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించింది. ఎమ్మెల్యేల అభీష్టం మేరకు ఎంపీపీ పదవులను భర్తీ చేయాలని మంత్రులకు స్పష్టం చేసింది. జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల వారీగా రిజర్వేషన్లను పరిశీలించి రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు అభ్యర్థులను నిర్ణయించనున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక రోజున టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం మంత్రులకు సమాచారం ఇవ్వనుంది. దీనికి అనుగుణంగా జిల్లాల్లో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement