సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొలిక్కి వచ్చింది. రామగుండం మునిసిపల్ కార్పొరేషన్, 14 మునిసిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కాగా, కరీంనగర్ కార్పొరేషన్‌లో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. కరీంనగర్‌లో ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు. నామినేషన్ల తతంగం సాగుతున్నప్పటికీ, ఏ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వలేదు.
ఒక్కో వార్డు, డివిజన్ నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఒకరి కన్నా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మొదటి జాబితాను అధికారికంగా ప్రకటించినా.. బీఫారాలు ఇవ్వలేదు. సిరిసిల్ల మినహా మిగతా మునిసిపాలిటీల్లో కూడా అదే పరిస్థితి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకే బీఫారాలు ఇచ్చే అధికారం ఉండడంతో చివరి నిమిషంలో బీఫారాలు రిటర్నింగ్ అధికారులకు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
టీఆర్‌ఎస్‌లో బహుముఖ అభ్యర్థిత్వాలు
టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నరగపాలక సంస్థలతోపాటు అన్ని పురపాలక సంస్థల్లోని వార్డుల్లో తీవ్రంగా పోటీ నెలకొంది. ఒక్కో వార్డులో ఒకరికన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నామినేషన్లను దాఖలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు టికెట్లు ఆశిస్తున్న అందరినీ నామినేషన్లయితే వేయమని పురమాయించి, ఇతర పార్టీలకు వెళ్లకుండా ముందుకాళ్లకు బంధం వేశారని తెలుస్తోంది.
టికెట్ల విషయంలో అనుమానం ఉన్న నాయకులు టీఆర్‌ఎస్ టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఫారాలు అందజేయవచ్చనే ఉద్దేశంతో విడివిడిగా వేర్వేరు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి, రామగుండం పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొంది. కరీంనగర్‌లో అధికారికంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించే ఆలోచనతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నట్లు సమాచారం.
అధికారిక అభ్యర్థులకు ఎమ్మెల్యేల సూచనలు
టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో బీఫారం ఇద్దామనుకున్న నాయకులకు ఎమ్మెల్యేలు ముందుగానే సానుకూల సూచనలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి గెలిచి తరువాత టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కొందరికి మొండిచెయ్యి ఇచ్చినట్లు సమాచారం. గెలిచే అవకాశం లేదని తమ సర్వేల్లో తేలిన మాజీ కార్పొరేటర్లను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే టికెట్లు రానివారెవరూ బీజేపీ, కాంగ్రెస్‌లోకి వెళ్లి బీఫారాలు తెచ్చుకోకుండా 14వ తేదీన బీఫారాలను నేరుగా రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాలని నిర్ణయించారు.
కాగా ఎమ్మెల్యేల కనుసన్నల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతోపాటు పార్టీ టికెట్టు లభిస్తుందని ఆశిస్తున్న వారు కూడా ఇప్పటికే ప్రచారాల్లో మునిగిపోయారు. ఒక్కో వార్డులో ఇద్దరు కన్నా ఎక్కువ సంఖ్యలో టీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థులుగా ప్రచారం సాగిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్‌లో అయోమయం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు కోరిన ఈ రెండు పార్టీలలో బీజేపీకి కరీంనగర్, రామగుండం కార్పొరేషన్‌లలో టికెట్ల కోసం పోటీ ఉండగా, అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున కూడా పలు వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. 60 డివిజన్‌లలో ఎంత మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారనేది తేలాల్సి ఉంది.
ఎంఐఎం తరఫున సుమారు 10 వార్డుల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ , కాంగ్రెస్ సైతం చివరి నిమిషంలోనే బీఫారాలు అందజేసే ఆలోచనలో ఉన్నాయి. కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లో కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment