ఇక ఎప్పుడైనా.. బల్దియా పోరు  | Municipal Elections Will Conduct On November In karimnagar | Sakshi
Sakshi News home page

ఇక ఎప్పుడైనా.. బల్దియా పోరు 

Published Wed, Oct 23 2019 7:57 AM | Last Updated on Wed, Oct 23 2019 7:57 AM

Municipal Elections Will Conduct On November In karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఎట్టకేలకు బల్దియా ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యే గడియలు వచ్చేశాయి. గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ఎన్నికలు వచ్చే నెలలోగా ఎప్పుడైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో బల్దియా పోరుకు మార్గం సుగమమైంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పట్టణాలు, నగరాలలో మరోసారి ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. 

రెండు కార్పొరేషన్లు 14 మునిసిపాలిటీలు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని కరీంనగర్, రామగుండం నగర పాలక సంస్థలతోపాటు 14 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కరీంనగర్‌ నగర పాలక సంస్థలో గతంలో 50 డివిజన్లు ఉండగా, శివారు గ్రామాల విలీనంతో వాటి సం ఖ్య 60కి పెరిగింది. రామగుండంలో 50 డివి జన్‌లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న 8 మునిసిపాలిటీలకు అదనంగా ఆరు కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటయ్యాయి. ఆయా మునిసిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను ఖరారు చేశారు. దాదాపు నాలుగు నెలలుగా ప్రత్యేక అధికారులు పాలనలో ఉన్న ఈ నగర, పుర పాలక సంస్థలకు ఎన్ని కలు జరిగితే ప్రజా ప్రతినిధులు రానున్నారు. 

అన్ని స్థానాలపై టీఆర్‌ఎస్‌ కన్ను
అధికార టీఆర్‌ఎస్‌ హవాలో చెల్లాచెదరై పోయిన విపక్షాలకు ఈ మునిసిపల్‌ ఎన్నికలు జీవన్మరణమే. కరీంనగర్‌ నుంచి కేబినెట్‌లో నలుగురు మంత్రులకు చోటు దక్కడంతో రెండు కార్పొరేషన్లు, గంపగుత్తగా మునిసిపాలిటీలను గులాబీ ఖాతాలో వేసుకునే దూకుడుతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నా రు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ మీద కొత్తగా కేబినెట్‌లో స్థానం పొందిన గంగుల కమలాకర్‌ పూర్తిస్థాయి దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ హవా, పుల్వామా దాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఎఫెక్ట్‌తో పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి చాటుకున్న బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వవద్దన్న పట్టుదలతో ఉన్నారు. రామగుండం కార్పొరేషన్‌పై స్థాని క ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌తోపాటు సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిన హుస్నాబాద్‌ నియోజకవర్గాలలోని మునిసిపాలిటీలపై కన్నేశారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల బాధ్యతను మంత్రి కేటీఆర్‌ స్థానిక నాయకత్వానికి అప్పగించి, దిశా నిర్ధేశం చేయనున్నారు. పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీల బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు భుజాలకు ఎత్తుకున్నా రు. కొత్త మునిసిపాలిటీ మంథనిని కాంగ్రెస్‌ కు పోకుండా పెద్దపల్లి జెడ్‌పీ చైర్మన్‌ పుట్ట మధు జిల్లా పరిషత్‌ ఎన్నికల ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. 

పార్లమెంటు ఎన్నికల బీజేపీ హవా ఏది..?
దేశానికి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలనే ఆలోచన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్‌పై సానుభూతి కూడా ఆ ఎన్నికల్లో పనిచేసింది. ఈ కారణాలతో ఓటర్లు ఎంపీగా గెలిపించారు. తరువాత జరిగిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికల నాటి హవా ఏ నియోజకవర్గం లోనూ కనిపించలేదు. కనీసంగా ఒక జెడ్‌పీటీసీ స్థానాన్ని గానీ, ఎంపీపీని గానీ గెలుచుకోలేకపోయింది. ఎంపీ సంజయ్‌ మినహా మిగతా పార్టీ నాయకులు క్రియాశీలకంగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కరీంనగర్‌ పార్లమెంటు పరి ధిలోని కరీంనగర్, ఇతర మునిసిపాలిటీల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఆశలు ఎంత మేర సఫలమవుతాయనేది వేచి చూడాల్సిందే. 

కాంగ్రెస్‌లో కదనోత్సాహం వస్తుందా..?
2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అన్ని ఎన్ని కల్లో పరాజయాలనే మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ మునిసిపోల్స్‌ మీద కొంత ఆశతో ఉంది. కరీంనగర్‌ పాత జిల్లాలో ముఖ్య నాయకులం తా ఇంకా పార్టీలోనే ఉండడం, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని నాయకులు పట్టుదలతో ఉండడం ఆశలు రేకెత్తిస్తోంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలపై దృష్టి పెట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం సైతం ఈసారి కరీంనగర్‌ కార్పొరేషన్, చొప్పదండి తదితర మునిసిపాలిటీలపై దృష్టి పెట్టారు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మునిసిపాలిటీలపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పట్టు సడలలేదు. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మె ల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలో రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మునిసిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఈర్ల కొమురయ్య, రాజ్‌ఠాకూర్‌ వంటి నాయకులు పట్టుదలతో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement