
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి స్థాయి నేతలు, సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నియంత కేసీఆర్, ఆయన కుటుంబ పాలనలో పని చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. మంగళవారం కరీంనగర్‌లో విలేకరులతో పొన్నం మాట్లాడారు. కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారంపై అడిగిన ప్రశ్నలకు పొన్నం పైవిధంగా స్పందించారు. 2014 ఎన్నికల్లో పేర్కొన్న మేనిఫెస్టో అంశాలను తుంగలో తొక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచిందని దుయ్యబట్టారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి కుంటుపడిందని, ఆర్థిక క్రమశిక్షణ లేక రాష్ట్రాన్ని దివాలా తీశారని పేర్కొన్నారు. కరీంనగర్‌కు మెడికల్ కళాశాల తీసుకురాలేదని, తాము తెచ్చిన శాతవాహన వర్సిటీకి కనీసం వీసీనీ నియమించలేదన్నారు. కరీంనగర్‌కు నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదని, కరీంనగర్‌ను లండన్‌గా మార్చుతామని ముక్కలు చేసి భౌగోళికంగా కళావిహీనం చేశారన్నారు. ఓటమి తప్పదని తెలిసిన కేసీఆర్ సహనం కోల్పోయి బహిరంగసభల్లో బూతులు మాట్లాడుతున్నారని, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు రాష్ట్రానికి పట్టుకున్న శనిలాంటి వారని పేర్కొన్నారు. డిసెంబర్ 7న అమావాస్య అని, అదే రోజు జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదన్నారు.