సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల కంటే ముందున్న టీఆర్‌ఎస్.. 14 నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం ప్రత్యర్థి పార్టీల మాదిరిగానే ఉంది. అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఈ 14 స్థానాల్లో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ప్రచారం చేసేందుకు శ్రేణులు ఉత్సాహంగా ఉన్నా అభ్యర్థి ఎవరనేది తెలియక ముందడుగు వేయట్లేదు. టికెట్ ఆశిస్తున్న నేతల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో బాగానే ఉన్నా తొందరపడి ప్రచారం నిర్వహిస్తే అధిష్టానం వద్ద ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని ఆందోళనలో ఉన్నారు. అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారు కార్యక్రమాలు నిర్వహించట్లేదు.
గ్రామ, మండల, ఇతర ద్వితీయ శ్రేణి నేతలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని స్థానాలకు సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ స్థానాల అభ్య ర్థుల ప్రకటన వాయిదా పడుతోంది. ఉమ్మడి జిల్లాల సభల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అమావాస్య తర్వాతి రోజున పెండింగ్‌స్థానాలకు ప్రకటించనున్నట్లు సమాచారం.
♦ గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న ఖైరతాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను టీఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. మొదట గోషామహల్‌లో నాగేందర్‌ను బరిలో నిలపాలని భావించింది. గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన ఖైరతాబాద్ స్థానంలో అవకాశం ఇవ్వాలని దానం విజ్ఞప్తి మేరకు స్థానాన్ని మార్చింది.
♦ గోషామహల్‌లో మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌కు అవకాశమిచ్చింది. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నందకిశోర్ బిలాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా రాథోడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది.
♦ ముషీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్‌కు అవకాశం ఇస్తోంది. సామాజిక సమీకరణాల ప్రకారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఇక్కడ అవకాశం ఇవ్వట్లేదని తెలిసింది.
♦ అంబర్‌పేట టికెట్‌ను టీఆర్‌ఎస్ అధిష్టానం కాలేరు వెంకటేశ్‌కు ఖరారు చేసింది. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కృష్ణయాదవ్, గడ్డం సాయికిరణ్ టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
♦ చార్మినార్‌లో దీపాంకర్‌పాల్‌కు టికెట్ దాదాపు ఖరారైంది. ఇలియాస్ ఖురేషీని కూడా పరిశీలిస్తోంది. ఎంఐఎం కంచుకోట అయిన చార్మినార్‌లో టీఆర్‌ఎస్ పోటీ నామమాత్రంగానే ఉండనుంది.
♦ మలక్‌పేట అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చవ్వా సతీశ్ పేరును ఖరారు చేశారు. 2009 నుంచి ఈ సెగ్మెంట్ ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. ఇక్కడా టీఆర్‌ఎస్ అభ్యర్థి పోటీ నామమాత్రమే కానుంది.
♦ మేడ్చల్ స్థానంలో ఎంపీ సీహెచ్ మల్లారెడ్డికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. అయితే తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలసి పని చేసుకోవాలని సూచించింది. సుధీర్‌రెడ్డితో సయోధ్య కోసం మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారు. సుధీర్‌రెడ్డి మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
♦ మల్కాజిగిరిలో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావును బరిలో దింపాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి తన కోడలు విజయశాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
♦ చొప్పదండి అభ్యర్థిగా టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ఖరారయ్యారు. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు.
♦ జహీరాబాద్‌లో ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాణిక్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు.
♦ వికారాబాద్ టికెట్ టి.విజయ్‌కుమార్‌కు ఖరారైంది. మరో నేత ఎస్.ఆనంద్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
♦ వరంగల్ తూర్పులో బీసీ వర్గాలకు టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ పేరును ఖరారు చేసింది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, టీఆర్‌ఎస్ సీనియర్ నేత గుడిమల్ల రవికుమార్ ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
♦ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి వైపు టీఆర్‌ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది.
♦ కోదాడలో వేనేపల్లి చందర్‌రావుకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. కోదాడ నియోజకవర్గ ఇంచార్జి కె.శశిధర్‌రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment