సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను గెలు చుకుంటుందని, కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యత కనిపిస్తోందని, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మానేసి ఇంట్లో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో గురువారం కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే... ‘కేంద్రంలో పక్కాగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ప్రధానమంత్రి ఎవరనేది మే 23 తర్వాత తేలుతుంది. కేంద్రంలో సంకీర్ణం రాగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సులభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే నియోజకవర్గాల పునర్విభజన ఆగింది. ఇది పూర్తయితే పార్టీలో చేరుతున్నవారికి అవకాశాలు రావొచ్చు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కకావికలం అవుతుంది. నేను నెల రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న. ప్రతిపక్షపార్టీలకు క్యాడర్ లేదు. టీఆర్‌ఎస్ ఉన్నంత బలంగా ఏ పార్టీ లేదు. 16 ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం ఉంది. ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో విజయంపైనా అనుమానాలు లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి అనేది సరికాదు. ఆ స్థానాల్లో మేం ఎవరికి బీఫామ్ ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లోని ఓట ర్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాకు ఓటు వేయలేదు. నిరుపేదలు, రైతులు, బలహీనవర్గాలు, మధ్యతర గతి మాకు బలమైన ఓటుబ్యాంకు. ఈ ఎన్నికల్లోనూ మాకు అండగా నిలబడతారు’అని కేటీఆర్ అన్నారు.
టీడీపీ ఓట్లు మాకే...
‘లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదు కాబట్టి ఆ పార్టీ క్యాడర్ కూడా టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నల్లగొండలో గెలుస్తాననే నమ్మకం ఉంటే హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. విశ్వసనీయతలేని వాళ్లు మేనిఫెస్టోలో ఏం పెట్టినా ప్రజలు నమ్మరు. అభ్యర్థుల స్థానికత గురించి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు మాట్లాడటం హాస్యాస్పదం. కేరళలో పోటీ చేస్తున్న రాహుల్‌కు స్థానికత వాదన వర్తించదా? ఈ ఎన్ని క ల్లో పోటీ పార్టీల మధ్యేకాని అభ్యర్థుల ప్రభావం ఉం డదనుకున్నాం. చేవెళ్ల సెగ్మెంట్ మినీ ఇండియా. ఈ నియోజకవర్గంలో లోకల్, నాన్ లోకల్ అంశం పనిచేయదు. కేరళకు రాహుల్ లోక లా? ఇండియాకు సోనియా లోకలా? మోదీ వారణాసికి, రేవంత్ మల్కాజ్‌గిరికి లోకలా? కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా లో రేణుకాచౌదరి పేరు చివరివరకు లేదు. మా అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోసం చివరిదాకా ప్రయత్నించారు’ అని అన్నారు.
తెలంగాణ సమాజం బీజేపీని స్వాగతించదు...
‘తెలంగాణ సమాజం బీజేపీని ఎప్పుడూ స్వాగతించదు. తెలంగాణకు కేంద్రం ఏమి చేసిందని కిషన్‌రెడ్డికి ప్రజలు ఓటు వేయాలి. కేంద్రంలో తెలంగాణకు ఉన్న ఏకైక మంత్రి పదవినీ బీజేపీ తీసేసింది. మోదీ గెలిచేది లేదు. కిషన్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చేది లేదు. టీఆర్‌ఎస్ గెలుపుపై రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇంకా రాజకీయాల్లో ఉన్నానని ఎలా అను కుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి ఇప్పటికే రాజీనామా చేయాల్సింది. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ముందురోజు వరకు టికెట్ అడిగారు. ఇవ్వకపోయేసరికి రూ.200 కోట్లకు అమ్ముకున్నారని మాట్లాడటం సరికాదు. టికెట్ ఇవ్వకపోతే గొంతు కోశారని వివేక్ అనటం సరికాదు. మొన్నటివరకు సహచరులు. వారిని నేనేమీ అనను. టికెట్ ఇవ్వకపోవడానికి చాలా కారణాలు, లెక్కలున్నాయి. ఎమ్మెల్యేల సానుకూలత లేకపోవటం వంటి కారణాలున్నాయి. పార్టీని అంటిపెట్టుకొని ఉంటే అవకాశాలు వస్తాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. వాళ్లకు ఏమైనా ఇచ్చి గౌరవించుకుంటాం’అని అన్నారు.
కేసీఆర్‌ను తిడితే చంద్రబాబుకు లాభం ఉండదు
‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అన్ని కలసి ప్రచారం చేశాయి కాబట్టి మాకు ఏడు సీట్లు తగ్గాయి. చంద్రబాబు ప్రచారం వల్ల మాకు లాభం జరగలేదు, నష్టమే జరిగింది. కొన్ని సీట్లు కోల్పోయాం. కేసీఆర్‌ను తిడితే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు లాభం జరగదు. చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇవ్వాలని ఏపీ ప్రజలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం ఉన్న ఓట ర్లు గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఓటేశారు. మేం గెలిచిన సీట్లే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు’అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment