ఉద్ధవ్ ఠాక్రే (ఫైల్ ఫోటో)
ముంబై: రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గత కొద్ది రోజులుగా బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శివసేన ఛీప్ ఉద్ధవ్ ఠాక్రేతో ఇటీవల సమావేశం అయ్యారు. భేటీ అనంతరం కూడా ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై అసహనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమిత్ షా పర్యటనపై శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఘాటు వ్యాఖ్యలు చేయటంతో ఒంటరిపోరు ఖాయమనే సంకేతాలు అందించింది.
సార్వత్రిక ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది నవంబర్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన నేతలు భావిస్తున్నారు. ఒక వేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సీఎం పదవి మాత్రం తమకే దక్కాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన పాల్ఘడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో శివసేన ఒంటరిగానే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకున్న శివసేన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిపి వెళ్తేనే 2014 ఫలితాలు పునరావృత్తం అవుతాయని కొంత మంది నేతలు భావిస్తున్నారు. శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే సీఎం పదవి దక్కడం కష్టమేని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో 130 స్థానాలు చాలా కీలకమైనవని, గత ఎన్నికల్లో శివసేన ఆ ప్రాంతంలో కేవలం 30 స్థానాల్లోనే విజయం సాధించారని గుర్తుచేశారు. ఇటీవల శివసేన 52వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పరిపాలన, పథకాలపై డోర్ టూ డోర్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం ప్రతీష్టత్మకంగా నిర్మిస్తున్న ముంబై-అహ్మాదాబాద్ బులెట్ రైల్ ప్రాజెక్టుని శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు వల్ల ముంబైకి ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం గుజరాత్ లాభం కోసమే మోదీ ఆ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment