
సాక్షి, హైదరాబాద్ : పంచాయితీ రాజ్ వ్యవస్థలో అవినీతి లేకుండా ఉండేందుకు అంబుడ్స్‌మెన్ వ్యవస్థ ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పంచాయితీ రాజ్, రాజ్యాంగ సవరణపై మంత్రి లోకేశ్‌కు అవగాహన కల్పించాలని అన్నారు. కేరళలో పంచాయితీ రాజ్ వ్యవస్థను ఓ సారి చూసి రావాలని సూచించారు. వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పంచాయితీ రాజ్ దినోత్సవం.. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సర్పంచ్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి లేదని విమర్శించారు. రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అంబుడ్స్‌మెన్ వ్యవస్థ అమలు కావడం లేదు.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేవలం పది అధికారాలను మాత్రమే పంచాయితీలకు ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు. వాటిని మైనింగ్, ఇసుక మాఫియాలా తయారు చేసిందని ఆరోపించారు.
పంచాయితీలు కునారిల్లుతున్నా.. ప్రభుత్వ అక్రమాలు బయటపడతాయనే అంబుడ్స్‌మెన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని ఉమ్మారెడ్డి విమర్శించారు. పండించిన పంటను కొనే నాధుడు లేడు.. అయినా ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పించన్, ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీ దగ్గరకు వెళ్లమంటున్నారు.. టీడీపీ వాళ్లు కాదంటే చెక్ పవర్ తీసేస్తారని ఎద్దేవా చేశారు.
పంచాయితీ రాజ్ వ్యవస్థలో ఇన్ని దురాగతాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. కానీ ఇప్పడు వాటిని అమలు చేయకుండా ఆత్మ వంచనకు పాల్పడుతుందని తెలిపారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేందుకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment