పరిగి: మరో రెండు నెలల్లో దుష్ట రాక్షస టీఆర్‌ఎస్ పాలన అంతమై రాష్ట్రానికి పట్టిన శని విరగడ కానుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. పరిగిలోని తాజా మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి నివాసంలో ఆదివారం నిర్వహించిన చండీయాగానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అ«ధికార పార్టీ నేతలు, వారి అండతో కొందరు అధికారు లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే వాళ్ల పని పడతామని హెచ్చరించారు.
కేసీఆర్, మోదీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై తొండి ఆట ఆడుతున్నారన్నారు. కేసీఆర్ తన గోతిని తానే తొమ్మిది నెలల ముందు తవ్వుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కోరికను నెరవేరుస్తామని స్పష్టం చేశా రు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుని దాచుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. దళిత, గిరిజనులకు రేషన్ సరుకులన్నీ ఉచితంగా ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు.
ఆ హామీ గుర్తులేదు..
గిరిజన రిజర్వేషన్లపై మొదటి సంతకమన్న కేసీఆర్.. నేటికి 10 వేల సంతకాలు చేసినా ఆ హామీ మాత్రం గుర్తుకు రావడం లేదని ఉత్తమ్ ఆరోపిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలతో పాటు ప్రతి సంఘానికి రూ.లక్ష గ్రాంటు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్, పద్మావతిరెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, ఉమా రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్ పాత్ర శూన్యం
పరిగి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్ పాత్ర శూన్యం అని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పరిగిలోని తాజా మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో నిర్వహిస్తున్న మహా సుదర్శన యాగం, చండీ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ దీక్ష, ఉద్యమంతో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారని, కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎందరో ఉగ్రవాదులను అణచివేసిన కాంగ్రెస్‌కు నమ్మకద్రోహి కేసీఆర్ ఓ లెక్కా అని వ్యాఖ్యానించారు. కేవలం ఇద్దరు ఎంపీలతో రాష్ట్రం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌తోనే సుపరిపాలన
దేశంలో సుపరిపాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని జానారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనను గాలికొదిలేశాయని ఆయన విమర్శిం చారు. అన్నివర్గాలకు సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్‌కే సాధ్యమని, అధికారంలోకి వచ్చేం దుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకిచ్చిన హామీలను కేసీఆర్ గాలికొదిలేశారన్నారు. రెండు లక్షల ఇళ్లు కట్టిస్తామన్న ఆయన కనీసం 10 వేల ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. హామీల అమలులో విఫలమైన కేసీఆర్ ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment