సోమవారం గాంధీభవన్‌లో నిరాహార దీక్ష చేస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, వీహెచ్, షబ్బీర్, పొన్నాల, సంపత్. చిత్రంలో పొంగులేటి, దానం, కుంతియా, రఘువీరా తదితరులు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, తమ పార్టీ నేతృత్వంలోనే దళిత, గిరిజన, ఆదివాసీ, మైనార్టీ, మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నేతలు ఉద్ఘాటించారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ దీక్ష’జరిగింది. దీక్షకు హాజరైన పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. దేశంలో దళితుల హక్కులను నీరుగార్చే కుట్ర జరుగు తోందని ఆరోపించారు. రాష్ట్రంలోనూ దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్ తానే ఆ కుర్చీలో కూర్చుని అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ దళితులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వాలను ప్రశ్నించాలి: ఉత్తమ్
ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు విధ్వంసకర ఘటనల్లో చాలా మంది దళితులు చనిపోయారని, తెలంగాణలోనూ కేసీఆర్ నేతృత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ దాడులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వాలు దళితుల పట్ల అనుసరిస్తున్న విద్వేషకర విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసమే రాజ్యాంగం అట్రాసిటీ చట్టాన్ని ఇచ్చిందని, ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దళిత హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాల వైఖరిని ఎదుర్కొనేందుకు పోరాడతామన్నారు.
మతకల్లోలాలతోనే బీజేపీ గెలుపు: జైపాల్
కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ మతకల్లోలాలు జరిగిన చోటే బీజేపీ గెలుస్తుందని, అవి జరగకపోతే బీజేపీ ఎక్కడా గెలవదని అన్నారు. ప్రభుత్వ లాయర్లు సరిగా వాదించకపోవడం వల్లనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నీరుగారేలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీలో బీజేపీకి మిత్రుడిగా, గల్లీలో శత్రువుగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ రాకముందు కేసీఆర్ తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారని, అధికారం వచ్చాక మాట తప్పారని అన్నారు. ఒక్క సంవత్సరంలో ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పిన భారీ అంబేడ్కర్ విగ్రహం ఎక్కడని ప్రశ్నించారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ మార్కు రాజ్యాంగం, రాష్ట్రంలో కేసీఆర్ మార్కు రాజ్యాంగం నడుస్తున్నాయని ఆరోపించారు. నాటి అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను కదలించిన మహానేత వైఎస్ మహాపాదయాత్ర చేపట్టి 15 ఏళ్లు అవుతోందని, ప్రజల అడుగుల్లో అడుగేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు.
కాంగ్రెస్‌తోనే సమాన హక్కులు: రఘువీరా
దీక్షకు హాజరైన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులు, మహిళలు, మైనారిటీలు, గిరిజనులకు ఒక రక్షణ కవచమని, అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లా డుతూ దళితులను ఇసుక ట్రాక్టర్ల కింద నలిపేసిన చరిత్ర కేసీఆర్‌దని అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్ట పరచాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం తాను చేపట్టిన దీక్షను సాయంత్రం 5 గంటల సమయంలో ఉత్తమ్ విరమించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సీ కుంతియా, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
23న ఢిల్లీలో..
దేశంలోని దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 23న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం జరుగుతుందని ఉత్తమ్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే ఈ సమ్మేళనానికి రాష్ట్రంలోని దళిత నేతలంతా హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment