సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మూడు రోజుల పర్యటనకు మంగళవారం విశాఖ రానున్నారు.శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులతో కలిసి మంగళవారం ఉదయం 8 గంటలకు విమానంలో విశాఖకు చేరుకోనున్న విజయసాయిరెడ్డి నేరుగా తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. తమను ఎస్టీల్లో చేర్చాలంటూ గత 28 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మత్స్యకారులకు సంఘీభావం ప్రకటిస్తారు. ఈ సందర్భంగా మత్స్యకారుల నుద్దేశించి మాట్లాడతారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుతో పాటు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, సిటీ అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా కమిటీల నేతలతో భేటీ అవుతారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకోనున్న సందర్భఃగా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జగనన్నతో కలిసి నడుద్దాం (వాక్ విత్ జగన్) కార్యక్రమం ఏర్పాట్లపై చర్చిస్తారు. పార్లమెంటు జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో రెండు కిలోమీటర్ల చొప్పున నడవాలని పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంటు, సిటీ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో సమీక్షిస్తారని వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment