శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న వర్ల రామయ్య
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం గెలిచే అవకాశం లేదని తెలిసీ దళిత నేత వర్ల రామయ్యను పోటీకి దింపి అవమానాల పాలు చేశారనే ఆగ్రహం పార్టీలో వ్యక్తమవుతోంది. నాలుగు రాజ్యసభ స్థానాలూ సంఖ్యాబలం దృష్ట్యా వైఎస్సార్ సీపీకి దక్కడం ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నా దళిత వర్గాన్ని మోసం చేసేందుకే చంద్రబాబు రామయ్యను బరిలో దింపినట్లు పేర్కొంటున్నారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలకు అనివార్యంగా ఎన్నికలు వచ్చేలా చేసి చివరికి తమకున్న కొద్దిమంది ఎమ్మెల్యేలతోనూ పూర్తిస్థాయిలో ఓట్లు వేయించుకోలేక అభాసుపాలయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు వర్లకు పూర్తి స్థాయిలో పడలేదని స్పష్టమవుతోంది. పోటీలో ఉన్నది దళిత నేత కావడం వల్లే నిర్లక్ష్యం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చెల్లుబాటు కాని బ్యాలెట్ పేపర్‌పై.. గెలిచేటప్పుడు మీ సొంత కులం వారికి, ఓడేటప్పుడు దళిత నేతకు సీటిస్తారా? అని రాసి ఉండడం చర్చనీయాంశమైంది. టీడీపీలో దళితులకున్న గౌరవం ఏపాటిదో దీనిద్వారా స్పష్టమైందని విశ్లేషకులు చెబుతున్నారు. (నలుగురూ నెగ్గారు )
► ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజికవర్గానికి చెందిన వారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చి సీట్లిచ్చారు. ఇప్పుడు ఓడిపోయే సీటును దళిత వర్గానికి కట్టబెట్టారు. ఆరేళ్లలో ఒక్క దళితుడు, ఒక్క బీసీ నాయకుడినైనా రాజ్యసభకు పంపకపోగా నమ్మించి మోసం చేశారని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
► 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా తన సొంత సామాజికవర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు.
► 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపినప్పుడు ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి టీజీ వెంకటేష్‌కు రెండో సీటు కేటాయించారు. మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన సన్నిహితుడైన సుజనా చౌదరికి చంద్రబాబు కట్టబెట్టారు. టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి అవమానించి పంపారు.
► 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు రెండోసారి అవకాశం ఇచ్చారు. మరో సీటు వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment