
లక్నో : భారతదేశాన్ని ఓ గొప్ప శక్తిగా తీర్చిదిద్దిన నరేంద్ర మోదీ వంటి ప్రధానిని భారతావని ఇంతకుముందెన్నడూ చూడలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్నారు. తన కుటుంబ సభ్యుల్లో కొంతమంది ప్రధానులుగా పనిచేసినప్పటికీ మోదీ వంటి పాలన అందించలేకపోయారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని పిల్‌భిట్‌లో ఆయన ప్రసంగిస్తూ...‘ వాజ్‌పేయి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన కఠిక పేదరికాన్ని మాత్రం అనుభవించలేదు. కానీ మోదీజీ ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. మా కుటుంబంలో కూడా కొంతమంది ప్రధానులుగా పనిచేసిన వాళ్లున్నారు. కానీ మోదీలాగా వారు భారత దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయలేకపోయారు’ అని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ప్రాణ త్యాగానికైనా సిద్ధం..
‘ మోదీ తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా ఆయన సిద్ధపడతారు. గత ఐదేళ్లలో ప్రధానిగా ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. అయినా మోదీ ఎవరి కోసం అవినీతికి పాల్పడతారు. ఆయనకేమైనా కుటుంబం ఉందా. దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించగల వ్యక్తి ఆయన’ అని వరుణ్ గాంధీ మోదీపై ప్రశంసలు కురిపించారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుణ్ గాంధీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. సుల్తాన్‌పూర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన తన తల్లి మేనకా ప్రాతినిథ్యం వహించిన పిలిభిట్ నుంచి పోటీ చేస్తుండగా.. సుల్తాన్‌పూర్ నుంచి మేనకా ఎన్నికల బరిలో దిగుతున్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 23న అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment