ఆ నివేదిక సీఎం రాసినట్టుంది: వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma Fires On Somayajulu Committee Report | Sakshi
Sakshi News home page

Sep 19 2018 2:27 PM | Updated on Sep 19 2018 2:38 PM

Vasireddy Padma Fires On Somayajulu Committee Report - Sakshi

తొక్కిసలాట ఫుటేజ్‌ తొక్కేశారని, సోమయాజులు అనే వ్యక్తిని గోదావరి క్షమించదని..

సాక్షి, హైదరాబాద్ ‌: సీఎం చంద్రబాబు నాయుడును కాపాడటానికే జస్టిస్‌ సోమాయాజులు నివేదిక ఇచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్‌ చేయగలరని చెప్పడానికి సోమయాజుల కమిటీ నివేదికే నిదర్శనమన్నారు. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పించడం సిగ్గుచేటని ఆగ్రహం వక్తం చేశారు. అసలు సోమయాజులు కమిటీ ఎందుకు వేశారని, ఏం చెప్పారని ప్రశ్నించారు. ఈ నివేదికను చంద్రబాబే రాసినట్టుందని, ఆయన రాసిన రిపోర్ట్‌పై సోమయాజులు సంతకం పెట్టినట్లుందన్నారు. ముఖ్యమంత్రి స్నానం చేసే వరకు ఎవరిని అనుమతించలేదని, తొక్కిసలాట జరుగుతున్న విషయం సీఎంకు చెప్పమని జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారని, సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్సీ నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కమిషనేమో సీఎం వెళ్లిన తర్వాత జరిగిందని చెబుతోందన్నారు.

పుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. లేని ముహూర్తం పెట్టి.. ప్రచార యావతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రమాదంపై చంద్రబాబుకి కనీసం మానత్వం కూడా లేదని విమర్శించారు. సీఎం స్నానం చేసే దృశ్యం డాక్యుమెంటరీ కోసం డైరెక్టర్‌ బోయపాటి బృందంతో ఏర్పాట్లు చేశారన్నారు. కమిషన్‌ రిపోర్ట్‌లో ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని ప్రశ్నించారు. అలాంటి రాతలు రాయటానికి చేతులెలా వచ్చాయని మండిపడ్డారు. తొక్కిసలాట ఫుటేజ్‌ తొక్కేశారని, సోమయాజులు అనే వ్యక్తికి గోదావరి గుణపాఠం తప్పదన్నారు. గోదావరి ఆయనను క్షమించదని, ఈ నివేదికను తమపార్టీ వ్యతిరేకిస్తుందని.. ఈ ఘటనపై తమ పోరాటం కోనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement