
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 54 శాతం ఉన్న బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బీసీలపై అంత ప్రేమ చూపిస్తున్న కేసీఆర్ 9 మంది బీసీ మంత్రులు ఉండాల్సిన కేబినెట్‌లో నలుగురికే ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలు ప్రభుత్వంలో ఉండి పాలన చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు కులాల వారీగా భవనాలు కడుతూ వాటికి నిధులు కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుల రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా.. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యతిరేకించడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. దీని వల్ల గత ఎన్నికల్లో తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు.