విజయవాడ సిటీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో జరిగిన భూ బాగోతాలతో పాటు లింగమనేని భూ దందాలపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరనున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.కరకట్ట లోపల నిర్మించిన ఇల్లును ఇచ్చినందుకే లింగమనేని రమేష్‌ను చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని రూ.50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అప్పనంగా కొట్టేశారు
‘‘కాజ, నంబూరు, కంతేరు గ్రామాల్లో ఐజేఎం–లింగమనేని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 2005–06లో 40 ఎకరాల్లో వెంచర్లు వేసి విలాసవంతమైన విల్లాలు నిర్మించింది. పొన్నూరు నియోజకవర్గం నంబూరు గ్రామంలో 200 ఎకరాల్లో లేఔట్లు వేశారు. 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ గ్రామ పంచాయతీకి 10 శాతం భూమిని రిజిస్టర్ చేయాల్సి ఉండగా చేయకుండా తప్పించుకున్నారు. కాజకు సంబం«ధించి జాతీయ రహదారిని ఆనుకుని విలాసవంతమైన విల్లాలు నిర్మించారు. మంగళగిరిలో 40 ఎకరాల్లో లేఔట్లు వేశారు. అక్కడి కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతీకి కట్టాల్సిన ఫీజులు రూ.కోట్లు ఎగవేశారు. చంద్రబాబు అండ చూసుకునే ప్రభుత్వానికి రావల్సిన రూ.వందల కోట్లకు ఎగనామం పెట్టారు. ఒక్కో విల్లాను రూ.5 కోట్లకు అమ్ముకుని, లేఔట్ ఫీజులు చెల్లించలేదు. 2005–06 నుంచి పన్నులు ఎగ్గొట్టారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి లేఖ రాసినా పట్టించుకోలేదు. అక్కడి రిజిస్టర్ విలువ ప్రకారం ఎకరం రూ.2.5 కోట్లు, మార్కెట్ విలువ రూ.15 కోట్ల వరకు ఉంది.
ఈ మేరకు కాజ గ్రామ పంచాయతీకి రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర ఎగవేశారు. పంచాయతీకి చెందని భూములు, దళితుల భూములను చట్టవ్యతిరేకమైన పద్ధతిలో ఇతరుల పేరిట మార్పిడి చేసుకున్నారు. రూ.250 కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేనిని చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారు. చంద్రబాబును అడ్డం పెట్టుకొని లింగమనేని రూ.100 కోట్ల దాకా రాయితీలు పొందారు. రియల్ ఎస్టేట్ ముసుగులో లింగమనేని వంటి వాళ్లు సాగించిన భూ బాగోతాలు బయటకు రావాలి. గత టీడీపీ ప్రభుత్వం అండతో దళితుల భూములను బలవంతంగా లాక్కొని వెంచర్లు వేశారు. వాటిపై కూడా దర్యాప్తు జరగాలి. కంతేరు గ్రామ డొంక భూములను సైతం కబ్జా చేశారు’’ అని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
అప్పుడు ఎందుకు స్పందించలేదు?
‘‘లింగమనేని భూ బాగోతాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, 12 ఏళ్లకు కూడా ఆ కేసులు బెంచ్‌పైకి రాకపోవడం ఏమిటి? చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నానని లింగమనేని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఆ ఇంటిపై 2015 ఫిబ్రవరి 6న తాడేపల్లి తహసీల్దార్ నోటీసు ఇస్తే ఎందుకు స్పందించలేదు? దీనిపై నేను హైకోర్టుకు వెళ్లినప్పుడు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు?’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
లింగమనేని దందాలపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి
Published Sun, Jul 7 2019 4:11 AM | Last Updated on Sun, Jul 7 2019 4:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment