
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విధంగా త్వరలోనే విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతున్న తరుణంగా మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీ గెలవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆదివారం విజయసాయిరెడ్డి విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న వైఎస్సార్‌సీపీకే ప్రజలను ఓటు అడిగే హక్కుందని అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చట్టం చేశామని చెప్పుకొచ్చారు.
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ప్రకటించడం చరిత్రాత్మకం అని సీఎం నిర్ణయంపై విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పద్దతులు.. పరిమితులు ప్రకారం ఎన్నికల్లో సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. పార్టీ నిర్ణయానికి లోబడి పనిచేసే వ్యక్తులకు మాత్రమే సీట్లు కేటాయిస్తాని తెలిపారు. అలాగే గెలుపు బాధ్యత పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలదే అని పేర్కొన్నారు. పార్టీ ఎదుగుదల కోసం పనిచేసే నాయకులకు సీఎం జగన్ ఖచ్చితంగా న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకుండా ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు టీడీపీని ఓడించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment