సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు సమీక్ష చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో మంగళవారం మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎంపీలు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటన వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. (నేటి నుంచి ఎన్యూమరేషన్ ప్రారంభం)
గ్రామ వాలంటీర్ ద్వారా ఇంటింటి సర్వే చేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని పూర్తి సేఫ్ &గ్రీన్ జోన్‌గా తయారు చేస్తామన్నారు. స్థానికంగా ఉన్నపశువుల కోసం 25 టన్నుల పశుగ్రాసం సరఫరా చేస్తున్నామని ప్రకటించారు. అలాగే ప్రజలకు మధ్యాహ్నం, సాయంత్రం భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాంతమంతా మామూలు పరిస్థితికి వచ్చేంతవరకు.. బాధ్యత అంతా ప్రభుత్వానిదే అని మరోసారి స్పష్టం చేశారు. అధికారులు, ప్రభుత్వం కృషితో ఇప్పటికే సాధారణ పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక పరిస్థితులపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. కంటి, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించి వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. నెలరోజుల పాటు మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. గ్రామాల్లో ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment