సాక్షి, అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషాయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్‌లీకేజీ మాత్రమే కాదని అనియంత్రిక స్టైరిన్ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయామని, అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో తీవ్ర తప్పదం జరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేషన్ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు. (ఎల్జీ గ్యాస్ లీకేజీపై హైపర్ కమిటీ నివేదిక)
సైరన్ ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం
‘ఫ్యాక్టరీలో ఉష్టోగ్రత కొలిచే పరికరం ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగంలో పైభాగంలో ఎంత టెంపరేచర్ నమోదు అవుతోంది తెలుసుకోలేకపోయారు. స్టైరిన్ పాలిమరైజేషన్ అవుతోందని వారికి డిసెంబర్‌లోనే రికార్డు అయింది. కానీ దీనిని వారు హెచ్చరికగా భావించలేదు. ఓ వైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరగడం, స్టైరిన్ బాయిలింగ్ పాయింట్‌కు చేరడం, ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్టైరిన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలేంటో పూర్తిగా డయాగ్రామ్ రూపంలో నివేదికలో పొందుపరిచాం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫ్యాక్టరీలో 36 చోట్ల అల్లారం పాయింట్‌లున్నాయి.. ప్రమాదం జరిగినా సైరన్ మోగించలేదు. ఎల్జీ పాలిమర్స్‌లో అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం. స్టైరిన్‌ను అదుపు చేసేందుకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలో లేవు. ఒకవేళ ఇలాంటి రసాయనాలు అందుబాటులో ఉంటే స్టైరిన్‌ను త్వరగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండేది. ఈ రసాయనాలను గుజరాత్ నుంచి తెప్పించాల్సి వచ్చింది. అప్పటికే ట్యాంకుల్లో టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాలపై అధ్యయనం
కేవలం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికే పరిమితం కాకుండా దీనికి సంబంధించిన అన్ని విభాగాల పనితీరుపైనా మేము విచారణ చేశాము. పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యమే కాని.. దానితోపాటు పరిశ్రమల భద్రత, పర్యావరణ సంరక్షణ కూడా ముఖ్యమే. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో చర్చించాము. ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఫ్యాక్టరీ జనావాసాల్లో ఉండేందుకు వీల్లేదు అని నివేదికలో స్పష్టంగా చెప్పాము. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలపై అధ్యయనం చేసి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలనే దానిపై సూచనలు చేశాం. చాలా ఫ్యాక్టరీల్లో స్టైరిన్‌లాంటి కెమికల్స్ వాడుతుంటారు ఇలాంటి ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిబంధనలు సూచించాం. పరిశ్రమల భద్రతకు సంబంధించి ఒకే ఏజన్సీకి అధికారాలివ్వాలని సూచించాం. ప్రమాదకర రసాయనాల ఫ్యాక్టరీలను జనావాసాల కంటే దూరంగా ఏర్పాటుచేయాలి. మాస్టర్ ప్లాన్ తయారు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్జీ పాలిమర్స్‌ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిది అనే మా అభిప్రాయం’ అని నివేదికలోని వివరాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment