
విజయసాయిరెడ్డి ,సుజనా చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న టీడీపీ ఎంపీలు సమష్టి బాధ్యత నుంచి తప్పుకొని రాష్ట్రపతి ప్రసంగంపై నిరసనలకు దిగటంపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగాన్ని మీరే ఆమోదించి మీరే నిరసనలకు దిగటం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేశారు. అరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై సమాధానం ఇస్తుండగా... ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి కోరారు.
ఈ సమయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచన మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ జోక్యం చేసుకుంటూ ఈ అంశాన్ని జైట్లీ దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నందున మంత్రి పదవికి రాజీనామా చేయటం మినహా సుజనాకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ చైర్మన్ జోక్యం చేసుకుంటూ..సుజనా చౌదరి కేంద్రానికి సూచన మాత్రమే చేసినందున ఇందులో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంశం తలెత్తదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment