
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరిట సోషల్ మీడియాలో దూషించిన ఉదంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ’ అంటూ నిలదీశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
ఆయన ట్వటర్‌లో ఏమన్నారంటే.. ‘ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ. జూనియర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా? యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా?’
ఇక, చంద్రబాబు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాదృచ్ఛికమేమీ కాదని, ఆ పాద మహిమ అలాంటిదని పేర్కొంటూ.. చిదంబరం అరెస్టు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఉదంతాలను ప్రస్తావించారు.
‘బాబు గారు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదు. పాద మహిమ అలాంటిది. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యులు పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి’అని ఆయన ట్వీట్ చేశారు.