సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఉపగ్రహం విధ్వంసక క్షిపణి ప్రయోగం’లో భారత్ సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడారు. మిషన్ శక్తి విజయంతో ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్ నాలుగో దేశంగా చరిత్ర సష్టించిందని చెప్పారు. ఈ విజయం తన ప్రభుత్వం హయాంలో జరిగిందని చెప్పుకున్నారు. అంతుకు ముందే తాను జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నాననంటూ పలు ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్లు కూడా రీట్వీట్లతో మారుమోగాయి.
శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్ ఎంత గొప్ప విజయం సాధించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో దాని గురించి ఇలా చాటింపు వేయడం కచ్చితంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనంటూ కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కూడా పరిశీలిస్తోంది. అయినా మోదీ సర్కార్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలు రావడం ఇప్పుడే కాదు, గత కొన్ని రోజులుగా వరుసగా వస్తూనే ఉన్నాయి. నరేంద్ర మోదీపై తీసిన బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం ఏప్రిల్ ఐదవ తేదీన విడుదలవుతున్న సందర్భంగా ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మోదీ బయోపిక్ చిత్రాన్ని విడుదల చేయడమంటే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. మరో పక్క రాహుల్ గాంధీ బయోపిక్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ రాగా’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మోదీ చిత్రం విడుదలకు అనుమతిస్తే రాహుల్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నారు.
రైలు, విమానయాన టిక్కెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలను ఎందుకు తొలగించలేదో వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర రైల్వే, విమానయాన శాఖలకు నోటీసులు జారీ చేసింది. ‘మేమంతా బీజేపీ కార్యకర్తలం, మెదీ తప్పకుండా గెలిచి మళ్లీ పీఎం కావాలి’ అంటూ రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ బహిరంగంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయరాదు. పైగా వారిద్దరు కలిసి ప్రభుత్వం కోసం పనిచేయాలిగానీ, బీజేపీ కోసం పనిచేయరాదు. మోదీకి ఓటేస్తానని ప్రతిజ్ఞ చేయండి, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి! అంటూ ఫేస్‌బుక్ పేజీల ద్వారా యాడ్స్ ఇవ్వడం కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: కేంద్రానికో న్యాయం, రాష్ట్రానికో న్యాయమా ?
మరోపక్క ద్వంద్వ ప్రమాణాలు
‘పీఎం–కిసాన్ యోజన’ కింద రైతుల ఆర్థిక భరోసా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం 19 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడాన్ని అనుమతించిన ఎన్నిక కమిషన్, అలాంటి స్కీమ్ కిందనే ఒడిశా ప్రభుత్వం నిధులను విడుదల చేయడాన్ని అడ్డుకుంది. ఇది ద్వంద్వ ప్రమాణాలు పాటించడం కాదా? ఆ రాష్ట్రం విమర్శిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment