రాజుల బంగ్లాలో ఆరోజు ఏం జరిగింది..? | Vizianagaram TDP Leaders Conflicts Election Day Before | Sakshi
Sakshi News home page

రాజ‘కోట’ రహస్యం!

Published Sat, Apr 13 2019 11:23 AM | Last Updated on Sat, Apr 13 2019 11:23 AM

Vizianagaram TDP Leaders Conflicts Election Day Before - Sakshi

విజయనగరం రాజుల బంగ్లా

ఎన్నికల్లో జగన్‌ ప్రభంజనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫ్యాన్‌ గాలిహోరెత్తింది. ఇప్పుడదే టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది. ఫలితాలు తమకు అనుకూలమేనని డాంబికాలు పలుకుతున్నా... అదంతా ఉత్తదేనని వారి మధ్య సాగుతున్న అంతర్గత యుద్ధాలు బట్టబయలు చేస్తున్నాయి. జిల్లాలోని బొబ్బిలి, విజయనగరం రాజుల కోటల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఇప్పుడు జిల్లాలో వైరల్‌ అవుతున్నాయి. బొబ్బిలికోటలో అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలతో ఘర్షణ చోటు చేసుకోగా... విజయనగరం కోటలో అశోక్‌ అనుచరుల మధ్య ఏకంగాకొట్లాటే జరిగిందని ఇప్పుడుప్రచారం సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒకప్పుడు వారు కదన రంగంలో రారాజులు.. విజయనగరం, బొబ్బిలి కోటల్లో పౌరుషాలతో రగిలి పోయి నైతిక విలువల కోసం యుద్ధాలు చేసుకున్నా రు. అలా జరిగిందే బొబ్బిలి యుద్ధం. విజయనగరం, బొబ్బిలి రాజులు పౌరుషాల కోసం ప్రాణాలు పణంగా పెట్టారు. ఏళ్లు... దశాబ్దాలు, తరాలు గడిచిపోయా యి. నాటి వైరం రాను రాను అంతరించిపోయింది. అదే సమయంలో వీరు వేర్వేరు పార్టీల్లో చేరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేశారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే పార్టీలోకి తీసుకువచ్చాననీ, వైరివర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాననీ గొప్పగా చెప్పుకొచ్చారు. వీరు గతంలో పరస్పరం తలపడితే ఇప్పుడు రెండు కోటల్లోనూ వారిలో వారే తలపడుతూ అంతర్గత యుద్ధాలు చేసుకుంటున్నారన్న విషయాలు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన సంగతి తెల్సిందే. వీరికి వ్యతిరేక పవనాలు కనిపిస్తున్న నేపథ్యంలో వారిలోవారే అంతర్గత యుద్ధాలకు తలపడుతున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేర కు.. శుక్రవారం చోటు చేసుకున్న సంఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అశోక్‌కు అన్నీ తానై నడిపిస్తున్న చంటి రాజు, గతంలోకేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పీఏగా వ్యవహరించిన గోపిరాజు తన్నుకుని చీపురుపల్లికి చెంది న మరో టీడీపీ నేత కేటీఆర్‌మీద పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారని బంగ్లా బాబు ల సమాచారం. విజయనగరంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి అశోక్, ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి గజపతిరాజు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెల్సిందే. ఈ పోరులో తండ్రీ కుమార్తెలిద్దరూ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువా రం జరిగిన పోలింగ్‌లో వీరికి వ్యతిరేకంగా ఓటరు తీర్పిచ్చినట్టు జిల్లా కేంద్రంలో వార్తలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యులుగా ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో నువ్వంటే నువ్వనే ఆరోపణలు చేసుకున్న అశోక్‌ అనుచరుడు చంటి రాజు, గోపి రాజు ఒకరిపై మరొకరు కలియబడ్డారు. తండ్రీ కుమార్తెలు ఇద్దరూ ఓడిపోయే పరిస్థితిని చంటి రాజు కోటలోని వ్యక్తులపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వీరిద్దరూ కలిపి చీపురుపల్లి టికెట్‌ ఆశించి భంగ పడ్డ కె.త్రిమూర్తుల రాజుపై పడినట్టు తెలిసింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడగా వైద్యం చేయించినట్టు తెలుస్తోంది.

బొబ్బిలిలో డబ్బుకోసం ఘర్షణ
బొబ్బిలిలో ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. అది టీడీపీ నేతలకు సంబంధించింది కావడంతో విషయం కేసుల వరకూ వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. దీనివల్ల ఎన్నికల్లో పంచడానికి నగదు కొరత వచ్చిందని సమాచారం. అలాగే పోలింగ్‌కు ముందు రోజు వరకూ డబ్బులు పంచడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బొబ్బిలి రాజులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే కోటలో తీవ్రంగా గొడవ పడ్డారన్న వార్త బయటకు వచ్చింది. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి బాహాబాహీ తలపడ్డారని సమాచారం. రాజకీయంగా సుజయ్‌కృష్ణకు ఎర్రతివాచీ పరిచిన బేబీ నాయన ఈ గొడవల్లో మనస్థాపానికి గురయినట్టు చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తం గా బీసీలను పక్కన పెట్టి ఓసీలయిన  రాజులకు చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. కురుపాంలో జనార్దన్‌ ధాట్రాజ్‌కు టిక్కెట్టు ఇచ్చి భంగపడ్డారు. అక్కడా ఓటమి ఖాయమని తెలిసి వైసీపీ ఎమ్మెల్యేపై దౌర్జన్యానికి తెగపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేం దుకు రాజకీయాల్లోకి వచ్చిన రాజులు ఓడిపోతామనే భయంతో వారిలో వారే పరస్పరం గొడవలు పడుతుండటంతో ప్రజలు విస్తుపోతున్నారు. ఇదిలా ఉండగా ఇన్నాళ్లూ విజయనగరం రాజుల బంగ్లాకు మకుటం లేని మహారాజులా మెలిగిన చంటిరాజును ఇకపై బంగ్లాలో అడుగుపెట్టవద్దన్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement