సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో వాట్సాప్ గ్రూప్‌లు దద్దరిల్లుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక వాట్సాప్‌లోనైతే.. చిన్ననాటి స్నేహితులు, పది, ఇంటర్, డిగ్రీ, ఊరు.. మండలం.. జిల్లా, పార్టీలు ఇలా అనేక గ్రూప్‌లు. ఈ ప్రతి గ్రూప్‌లో ఇప్పుడు ఒక్కటే చర్చ.. తెలంగాణ ఎన్నికలు. వాదనలు.. ప్రతివాదనలు. తమ పార్టీ గెలుస్తుందంటే.. తమ పార్టీ గెలుస్తుందనే పిడివాదనలు. నాయకుల మాటల తూటాలు.. అవినీతి ఆరోపణలు.. మేనిఫెస్టోలు.. బహిరంగ సభల హైలెట్స్ ఇలా ప్రతి ఒక్కటి కుప్పలు.. తెప్పలుగా షేర్ అవుతునే ఉన్నాయి. ఇక పార్టీలకు అనుకూలంగా ఉండే సర్వే రిపోర్టులకు అయితే కొదవేలేదు.
తమ నాయకుడు స్పీచ్ ఇరగదీసిండు.. అని ఒకరు ఓ వీడియో షేర్ చేయగానే.. దానికి బదులుగా మా నాయకుడేమన్న తక్కువనా? అని మరోకరు ఇంకో వీడియోను పోస్ట్ చేస్తున్నారు. తమ అభిమాన నాయకులను పల్లెత్తు మాట కూడా అననిస్తలేరు. తామే అభ్యర్థులగా బరిలోకి దిగినట్లు.. తమ నాయకున్ని అంటే తమనే అన్నట్లు ఫీలవుతున్నారు. ఈ తరహా చర్చతో ఎన్నికలపై కొంత అవగాహన వస్తున్నప్పటికీ.. వారి సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అప్పటి వరకు మంచి మిత్రులుగా ఉన్నవారు.. ఈ తరహా వాదనలతో శత్రువులుగా మారుతున్నారు. అన్నా.. తమ్ముడు.. కాక, మామా అని అప్యాయంగా పిలుచుకునేవారు.. ఎన్నికల పుణ్యమా.. నువ్వెంత? నీ నాయకుడెంతా? అని దుర్భాషలాడుకుంటున్నారు. ఈ తరహా చర్చలతో ఆగ్రహాలకు లోనై భౌతికంగా కూడా దాడులు చేసుకుంటున్నారు. మా నాయకుడు అధికారంలోకి వస్తే.. నీ సంగతి చూస్తా అని హెచ్చరించుకుంటూ.. మంచి సత్సంబంధాలను దెబ్బతీసుకుంటున్నారు. గ్రామాల్లో ఈ తరహా వాట్సాప్ ప్రభావం మరి ఎక్కువగా ఉంది.
వాట్సాప్ స్టేటస్..
వాట్సాప్ స్టేటస్‌ల్లో చాలా మంది తమ అభిమాన పార్టీకి మద్దతుగా వీడియోలు.. ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయా పార్టీలకు ఓటేయ్యాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరహా స్టేటస్‌లతో తాము ఏ పార్టీకి మద్దతుగా ఉన్నామో బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు. ప్రత్యర్థి నాయకుల టంగ్ స్లిప్‌లు.. సినిమా సీన్స్ తరహా స్పూఫ్‌ల వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
పార్టీలు కూడా..
సోషల్ మీడియాతో ప్రజలకు మరింత సులవుగా చేరువవచ్చని, ముఖ్యంగా యువకులను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్న రాజకీయ పార్టీలు.. తమకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులు కోవడంలేదు. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విటర్‌లో యాక్టీవ్‌గా ఉన్న నాయకులు.. ఇప్పడు వాట్సాప్ గ్రూప్‌లతో కార్యకర్తలకు మరింత దగ్గరవుతున్నారు. ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను గ్రూప్‌ల్లో కార్యకర్తలకు చేరువేస్తూ అలర్ట్ చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఓ టీమ్‌నే సిద్దం చేసుకుని ప్రచారంలో దూకుడును ప్రదర్శిస్తున్నారు.
యూట్యూబ్‌లో..
ఇక యువత గంటల తరబడి కాలక్షేపం చేసే యూట్యూబ్‌ను కూడా రాజకీయ పార్టీలు వదలడంలేదు. ఇప్పటికే టీవీలు.. పత్రికల్లో ప్రకటనలతో ఊదరగొడుతున్న నాయకులు.. యూట్యూబ్‌ను కూడా వదిలిపెట్టడం లేదు. యూట్యూబ్‌లో ఏ వీడియోను క్లిక్ చేసినా కొన్ని సెకన్ల పాటు ప్రకటన వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. యువకులు చేరువగా ఉండే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. షేర్ చాట్.. టిక్‌టాక్, సమోసా, హలో తదితర స్మార్ట్ మొబైల్ యాప్స్‌లో కూడా అకౌంట్స్ క్రియేట్ చేసి.. వారి ప్రచార వీడియోలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment