నారాయణఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థిపై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న నేతలు(ఫైల్)
సాక్షి,నారాయణఖేడ్: ఎన్నికల వేళ వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రచార పోస్టులు.. నేతలకు సంబంధించిన వీడియోల వరద పారుతోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్‌ను మీడియా సెల్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. నేతల అభిమానులు ప్రత్యర్థుల గురించి తప్పుడు వివరాలతో కూడిన మెసేజ్‌లను తయారు చేసి నెట్టింట్లోకి నెట్టి చేతులు దులుపుకొంటున్నారు. అవి నిజమా.. కాదా అని తెలుసుకోకుండానే కొందరు వాటిని ఇతర గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు పోస్ట్‌లను పంపిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు. ప్రతీ పోస్టుకు అడ్మిన్ సైతం బాధ్యుడేనని.. అవి తప్పని తేలితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇంటర్ నెట్, పుణ్యామాని వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఇబ్బడిముబ్బడిగా గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. అనేక మంది వారికి వచ్చిన సమాచారాన్నంతా చదవకుండానే, చదివినా వాస్తవమా కాదా అని తెలుసుకోకుండానే ఫార్వర్డ్ చేస్తూ ఏదో ఘనత సాధించినట్లు భావిస్తున్నారు. అలాంటి వారిపై ఈ ఎన్నికల సమయంలో కోడ్ కొరడా వేలాడుతోంది. క్రియేట్ చేసిన గ్రూపును సక్రమంగా, సమర్థవంతంగా, జనోపయోగకరంగా నిర్వహించే వారికి ఎన్నటికీ ఇబ్బందులు లేవు. కానీ గ్రూపు క్రియేట్ చేశాం.. దాని జనాలపైకి వదిలేశాం.. అనే వారికే చిక్కులు చుట్టుముట్టనున్నాయి. మీరు క్రియేట్ చేసిన గ్రూపులో ఎవరైనా ఏదైనా తేడా చేసినా, అసభ్యకరమైన, అవాస్తవమైన పోస్టు చేసినా అది గ్రూప్ క్రియేటర్ తలపై పడనుంది. ఇందుకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదై మూడు నుంచి ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సిన ప్రభావం నెలకొంది.
అడ్మిన్ ఆషామాషీ కాదు..
ఓ వాట్సప్ గ్రూపు తయారు చేశాడంటే ఆడ్మిన్‌గా ఉండడం అంటే ఆషామాషీ కాదు. గ్రూప్‌లో ఉన్న ఓ వ్యక్తి ఏదో విషయంపై షేర్ చేశాడంటే అతడితోపాటు అడ్మిన్‌కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మన గ్రూప్‌లోనే పోస్ట్ చేశారుకాదా.. గ్రూప్‌లో ఉన్నవారు మన మిత్రులే కదా.. ఏమవుతుందిలే అనుకుంటనే పొరపాటు. గ్రూప్‌లోని మరో వ్యక్తి దాన్ని వేరే గ్రూప్‌లో పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారుతుంది. ఇలా ఒక గ్రూప్ నుండి మరో గ్రూప్‌నకు ఎల్లలు లేకుండా అది ఎగురుతూ పోతుంది. కొన్ని గంటల్లోనే అందనంత దూరం వెళ్ళిపోతుంది. ఇది ఎవరికైనా బాధించినా, చట్టాలకు లోబడి లేకున్నా.. ఆవిషయంపై ఎవరైనా హర్ట్ అయి ఫిర్యాదు చేస్తే పోలీసు కేసులు ఎదుర్కోవాల్సిందే. సీఆర్పీసీ, ఐటీ చట్టం ప్రకారం కేసులు నమోదు అవుతాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైంగూర్చి ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కావున గ్రూప్ అడ్మిన్ ఏ లక్ష్యంతో గ్రూప్‌ను తయారు చేశాడో అందుకు అనుగుణంగానే గ్రూప్ కొనసాగాలి. వివిదాస్పద పోస్టులు వస్తే తొలగించడంతోపాటు, అట్టి పోస్టింగ్ పెట్టిన వారికి గ్రూప్‌నుండి రిమూవ్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో ఏదైనా పొరపాటు చేశామంటే పక్కా ఆధారాలు సేకరించడం పోలీసులకు పెద్ద పనేమీకాదు. పూర్తి ఆధారాలను సైబర్‌క్రైం పోలీసులు సేకరించి అందుకు బాధ్యులను దోషిగా నిలబెడతారు.
ఇలా ఉండాలి..
- వివాదాస్పద వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూప్‌లో అవకాశం కల్పించకూడదు.
- గ్రూప్‌కు కొన్ని నియమాలు, నిబందనలు పెట్టుకొని అందుకు అనుగుణంగా కొనసాగాలి.
- గ్రూప్ అడ్మిన్ ప్రతీ క్షణం గ్రూప్‌లో పోస్ట్ అవుతున్న అంశాలను, విషయాలను నిశితంగా పరిశీలించాలి..
- ఏవైనా అభ్యంతరకరాలు ఉంటే వాటిని వెంటనే తొలగించడంతోపాటు అట్టి పోస్ట్ పెట్టిన వ్యక్తిని గ్రూప్ నుంచి రిమూవ్ చేయాలి.
- వివాదాస్పదన విషయాలు పోస్ట్ చేసిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలి.
- గ్రూప్‌లో యాడ్ అవుతున్న ప్రతీ వ్యక్తి అడ్మిన్‌కు తెలిసి ఉం డాలి. గ్రూప్ అడ్మిన్ పరిపక్వతతో ఆలోచించగల నైపుణ్యం ఉన్నవాడై ఉండాలి.
- గ్రూప్‌లోని ప్రతీ పోస్ట్‌కు బాధ్యుడు అవుతాడనే విషయాన్ని గుర్తెరగాలి.
- అడ్మిన్ కానీ, సభ్యుడు కానీ వివాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ 153ఏ క్రింద 3 నుండి 5ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది. ఐటీ సెక్షన్ 66తోపాటు పలు సెక్షన్‌లు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
- వాట్సాప్ గ్రూపుల్లో వదంతులు, తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ కానీ, ఫార్వర్డ్ కానీ చేయొద్దు.
- ఎవరి ఫోటోలూ మార్ఫింగ్ చేసి పెట్టొద్దు.
- తప్పుడు సమాచారం, తెలియని సమాచారం పోస్ట్ చేయకూడదు.
- విద్వేషాలు రెచ్చగొట్టేవీ, తప్పదారి పట్టించేవి..
- వర్గపోరు, వివాదాలకు కారణాలయ్యేవి పోస్ట్ చేయొద్దు.
- అసభ్యకరంగా ఉండేవి, కించపరిచేలా ఉండేవి ఎవరికీ పంపకూడదు.
ఇదో ఉదాహరణ...
ఇటీవల నారాయణఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఓ సోషల్ మీడియాలో చిన్న కథనం ప్రసారం అయ్యింది. అభ్యర్థి దూషించాడంటూ అతనిపై పలు అసభ్యకర పదజాలంతో ఆ కథనంలో పేర్కొన్నారు. దీంతో సదరు టీఆర్‌ఎస్ అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు సదరు సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశాడు. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసునమోదు కూడా చేశాడు.. ఓ వాట్సప్ గ్రూపులో ఇటీవల ముగ్గురు వ్యక్తులు తమ నేత గొప్ప అంటే తమ నేతే గొప్ప అంటూ గంటలపాటు చాటింగ్ చేశారు.. ఈ విషయం ఆగ్రూప్‌లో ఉన్న పోలీసు అధికారులూ చూశారు. తెల్లవారే వాట్సప్ గ్రూపు అడ్మిన్లతో పాటు మీడియా సమావేశాన్ని డీఎస్పీ సత్యనారాయణరాజు ఏర్పాటు చేశాడు. చాటింగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమిటిదీ అని ప్రశ్నించారు. వాట్సప్‌గ్రూప్‌ల అడ్మిన్లకు సలహాలు సూచనలు ఇవ్వడంతోపాటు చట్టం పరిధి దాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నుండి పలు గ్రూప్‌లు డిలీట్ అవుతూ వస్తున్నాయి.
తప్పుడు పోస్టులు పెడితే జైలుకే...
సామాజిక మాద్యమాల ద్వారా, వాట్సప్ గ్రూపుల ద్వారా వ్యక్తులను, పార్టీలను కించపరచడం, బెదిరించడం చేస్తూ పోస్టులు పెడితే నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తామం. సైబర్‌క్రైంగూర్చి ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వ్యక్తులను, పార్టీలనైనా కించపరచినా, బెదిరించేలా వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినా సంబంధిత పోస్టు పెట్టిన వారితోపాటు గ్రూపు అడ్మిన్‌పైననూ, దాన్ని ఫార్వర్డ్ చేసిన వారూ నిందితులు అవుతారు. ఏది చేసినా చట్టాలకు లోబడే చేసుకోవాలి. చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఎవ్వరినీ ఉపేక్షించం. నాన్‌బేయిలబుల్ కేసులతోపాటు రెండేళ్ళు, ఆపైగా జైలు తప్పదు.
– సత్యనారాయణ రాజు, డిఎస్పీ నారాయణఖేడ్
Comments
Please login to add a commentAdd a comment