
రాజకీయ అనుభవమంత వయసున్న నేత ముఖ్యమంత్రి కావడం.. ఆయన ఎదుర్కోవడం..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం.. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఈ నెల 30న ముహుర్తం ఖరారు కావడం తెలిసిందే. అయితే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన టీడీపీ నుంచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటారనే అంశంపై టీడీపీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకున్న సమయానికి ఆ పార్టీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు మినహా హేమాహేమీలు ఫ్యాన్ సుడిగాలికి కొట్టుకుపోయారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు ఈ సారి ఘోర పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలను మరో సీనియర్‌కు అప్పగిస్తారనే అభిప్రాయం పార్టీలో అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. చంద్రబాబు రాజకీయ అనుభవమంత వయసున్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనుండటం.. రేపటి రోజున సభలో సభానాయకుడిని ఎదుర్కునే విషయంలో చంద్రబాబు ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుడిగా తన స్థానంలో మరో సీనియర్‌ని నియమించి తాను తప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.