మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
సాక్షి, కోల్‌కతా : ‘ఈ సారి మొహర్రమ్, దుర్గామాత నిమజ్జనం ఒకే రోజున వచ్చినందున మొహర్రమ్ జరిగే రోజున 24గంటలను మినహాయించి, ఆ మరుసటి రోజు నుంచి నాలుగవ తేదీ వరకు దుర్గా మాత విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మత సామరస్యం కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం తగదని జస్టిస్ రాకేశ్ తివారీ, జస్టిస్ హారిష్ టాండన్‌లతో కూడిన కోల్‌కతా హైకోర్టు ద్విసభ్య బెంచి కొట్టివేసింది. రాష్ట్రంలో మత కలహాలు జరిగితే అందుకు తనను బాధ్యురాలిని చేయరాదని కూడా మమతా బెనర్జీ కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించారు.
వాస్తవానికి దుర్గామాత నిమజ్జనం, మొహర్రమ్‌లు ఒకే రోజున రాలేదు. సెప్టెంబర్ 30వ తేదీన దుర్గామాత తుది పూజ లేదా నిమజ్జన కార్యక్రమంకాగా, ఆగస్టు ఒకటిన మొహర్రం వచ్చింది. మొహర్రం రోజున ఏకాదశి కూడా. బెంగాల్ సంస్కతి ప్రకారం ఆ రోజున, అంటే ఏకాదశి రోజున దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయరు. సాధారణంగా నిమజ్జనం రోజున, అంటే సెప్టెంబర్ 30వ తేదీనే నిమజ్జన కార్యక్రమం ముగిసిపోవాలి. గతంలో అలాగే జరిగేది. ఈ రెండు, మూడేళ్లుగా పోటాపోటీగా ఎత్తయిన విగ్రహాలను ఏర్పాటు చేయడం, అట్టహాసంగా వేడుకలను జరపడం మొదలవడంతో ఆ మరుసటి రోజు ఉదయం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది.
బహుశ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే మొహర్రమ్ రోజున నిమజ్జనం జరపరాదని, అటూ ముస్లింల ప్రదర్శనలు, ఇటు హిందువుల ప్రదర్శనలు కొనసాగడంవల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగవచ్చని మమతా బెనర్జీ ఆందోళన చెంది ఉంటారు. కోల్‌కతా సంప్రదాయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాదశి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించరు. మొహర్రం రోజున మాతం ప్రదర్శనలు జరిపే షియాలే పశ్చిమ బెంగాల్‌లో చాలా తక్కువ. కోల్‌కతా, మరికొన్ని పట్టణాల్లో తప్పించి ఎక్కడా ప్రదర్శనలే జరగవు. అలాంటప్పుడు మమతా బెనర్జీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు.
శ్రీరామ నవమి రోజున బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ఆయుధాలు ధరించి బెంగాల్‌లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరిపారు. దుర్గామాత నిమజ్జనం రోజున కూడా ఆయుధాలతో ప్రదర్శనలు జరపుతామని బీజేపీ హెచ్చరించింది. అందుకని మమతా బెనర్జీ భయపడుతున్నారా? ఇలా భయపడుతుంటే భయపెట్టే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. 1982, 1983 సంవత్సరాల్లో కూడా దశమినాడు దుర్గా నిమజ్జనం, ఏకాదశి నాడు మొహర్రమ్ వచ్చాయి. అప్పుటి వామపక్ష ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకపోయినప్పటికీ రెండు వర్గాల కార్యక్రమాలు శాంతియుతంగా ముగిశాయి.