
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడిగా పోటీ చేస్తున్న సమాజ్‌వాది, బహుజన సమాజ్ పార్టీలు ఉత్తరఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉమ్మడిగానే పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించాయి. ఇక బీహార్ రాష్ట్రంలో 40 స్థానాలకు పోటీ చేయాలని తమ పార్టీ నాయకురాలు మాయవతి ఆదేశించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లాల్జీ మేధ్కర్ వెల్లడించారు. మొత్తం లోక్‌సభలో 543 సీట్లు ఉండగా, ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 74 లోక్‌సభ సీట్లున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా, బిహార్‌లో విడిగా బీఎస్పీ పోటీ చేసినట్లయితే ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి? ఈ పార్టీలు మాత్రమే ఉమ్మడిగా పోటీ చేసినట్లయితే పాలకపక్ష బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయి ఆ పార్టీకే మేలు జరుగుతుందని కొంత మంది రాజకీయ పరిశీలకులు భావిస్తుండగా, అసలు ఈ పార్టీల ప్రభావం ఆయా రాష్ట్రాలో పెద్దగా ఉండదని మరికొంత మంది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఏది నిజమో తేల్చాలంటే అంతకుముందు ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేయాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 227 సీట్లలో రెండు సీట్లను మాత్రమే బీఎస్పీ గెలుచుకుంది. 5.01 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే గత పదేళ్ల కాలంతో పోలిస్తే పార్టీ బలం బాగా తగ్గుతూ వచ్చింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో రేవా లోక్‌సభ సీటుకు పోటీ చేసిన బీఎస్పీ తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో ఈ సీటును నిలబెట్టుకున్న ఈ పార్టీ మళ్లీ 2009 ఎన్నికల్లో మరోసారి గెలుచుకున్నది. మధ్యప్రదేశ్‌లోని వింధ్యా ప్రాంతంలో పార్టీకి గత మూడు దశాబ్దాలుగా ప్రజాదరణ ఉన్నప్పటికీ దాన్ని బీఎస్పీ ఎన్నికల విజయంగా మార్చుకోలేక పోయింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీకి 5.85 శాతం ఓట్లు రాగా, అది 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3.85 శాతం ఓట్లకు పడిపోయింది. ఈ సారి రాష్ట్రంలోని 29 లోక్‌సభ సీట్లకుగాను 26 సీట్లకు పోటీ చేయాలని బీఎస్పీ భావిస్తోంది. మిగతా మూడు సీట్లను సమాజ్‌వాది పార్టీకి వదిలేయాలని అనుకుంటున్నది.
ఈ రెండు పార్టీల ప్రభావం రెండు, మూడు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని భోపాల్‌కు చెందిన రాజకీయ వ్యాఖ్యాత గిరిజా శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో ఈ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఆయన అన్నారు. ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్న యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే అవకాశం లేదో, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఈ రెండు పార్టీలకు అవకాశం ఉండదని చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో కూడా ఈ రెండు పార్టీలకు విజయావకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పార్టీలతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నట్లయితే కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు కూడా బీజేపీకి పడతాయని, ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ కోఆర్డినేటర్ వైఎస్ సిసోడియా అభిప్రాయపడ్డారు.
ఉత్తరాఖండ్‌లో..
ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ సీట్లకుగాను హరిద్వార్, నైనిటాల్ నియోజక వర్గాల్లో బీఎస్పీకి గతంలో మంచి ప్రభావం ఉండింది. ఈ పార్టీకి 2009 సార్వత్రిక ఎన్నికల్లో 15.2 శాతం ఓట్లు రాగా, అది 2014 ఎన్నికల నాటికి 4.78 శాతానికి పడిపోయింది. 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలుచుకోగా, 2012లో జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకు పరిమితం అయింది. ఇక 2017లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది.
బిహార్‌లో..
బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటును కూడా ఏనాడు గెల్చుకోలేదు. 2009 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ పార్టీకి బక్సర్, సాసరమ్, గోపాల్‌గంజ్ నియోజక వర్గాల్లో ప్రభావం కాస్తా ఉండింది. కనుక ఆ ఎన్నికల్లో ఈ పార్టీకి 4.4 శాతం ఓట్లు రాగా ఆ తర్వాత ఐదేళ్లకు అది కాస్త 2.17 శాతానికి పడిపోయింది. 2005 నుంచి బీహార్ రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా బీఎస్పీ గెలుచుకోలేదు. అలాంటి రాష్ట్రంలో మొత్తం 40 సీట్లకు పోటీ చేస్తామని బీఎస్పీ ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. బీహార్‌లో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం బాగా పడిపోవడంతో వాటి స్థానంలో దళితులను ఆకర్షించవచ్చని బీఎస్పీ భావిస్తు ఉండవచ్చని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మహా కూటమిలో బీఎస్పీ చేరినట్లయితే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని సీట్లను దక్కించుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment