మైన్‌పురి ఎన్నికల ప్రచార వేదికపై పరస్పరం అభివాదం చేసుకుంటున్న ములాయం, మాయావతి
మైన్‌పురి / న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత 24 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఒకే వేదికను పంచుకున్నారు. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. యూపీలోని మైన్‌పురిలో క్రిస్టియన్ కాలేజీ గ్రౌండ్ ఇందుకు వేదికైంది. ఎస్పీ కంచుకోట అయిన మైన్‌పురిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ములాయం, బీఎస్పీ చీఫ్ మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, మద్దతుదారులను ఉద్దేశించి ములాయం మాట్లాడుతూ.. ‘చాన్నాళ్లకు మేమిద్దరం ఒకే వేదికపై మాట్లాడుతున్నాం. మాయావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు మద్దతివ్వాలని ఆమెను కోరుతున్నా’ అని అన్నారు.
ప్రధాని మోదీ నకిలీ బీసీ: మాయావతి
ములాయం అనంతరం మాయావతి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘గెస్ట్ హౌస్ ఘటన తర్వాత కూడా నేను ములాయం జీ తరఫున ప్రచారం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కొన్నికొన్ని సార్లు ప్రజా, దేశ, పార్టీ ప్రయోజనాల రీత్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ములాయం జీ సమాజంలోని అన్నివర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకున్న మోదీ, తన అగ్రకులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. కానీ ప్రధాని మోదీలా ములాయం నకిలీ వ్యక్తి, అబద్ధాలకోరు కాదు. ఆయన వెనుకబడ్డ కులంలోనే జన్మించారు. ములాయం నిజమైన నేత’ అని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా యూపీలోని 80 లోక్‌సభ సీట్లకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్‌ఎల్డీ 3 స్థానాల్లో కలిసి పోటీచేస్తున్నాయి. రాయ్‌బరేలీ(సోనియాగాంధీ), అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం ఈ ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థులను నిలబెట్టలేదు.
ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీ పొత్తు: బీజేపీ
ములాయం–మాయావతి కలిసి మైన్‌పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై బీజేపీ మండిపడింది. ఈ విషయమై బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, తుపాను లాంటి మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. యూపీలో ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీలు చేతులు కలిపాయని దుయ్యబట్టారు. ఇందుకోసం తన జీవితంలో జరిగిన అతిపెద్ద అవమానాన్ని(గెస్ట్‌హౌస్ ఘటన) మాయావతి దిగమింగారన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావగా తయారైందని చతుర్వేదినుద్దేశించి అన్నారు.
పాతికేళ్లనాటి పంచాయితీ!
ములాయం, మాయావతి బద్ధ విరోధులుగా మారడానికి కారణమైన గెస్ట్‌హౌస్ ఘటన 1995 జూన్‌లో జరిగింది. ములాయం నేతృత్వంలోని ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం యూపీలో కొనసాగుతోంది. కొత్త సర్కార్ కొలువుదీని అప్పటికి ఏడాదిన్నర. అంతలోనే బీఎస్పీ అధినేత కాన్షీరాం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తారని ములాయంకు జూన్ 1న సమాచారం అందింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బీఎస్పీని చీల్చాలనీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయాలని కొంతమంది ఎస్పీ నేతలు భావించారు. అదేసమయంలో అప్పటి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మాయావతి రాష్ట్రప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో జూన్ 2న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఎస్పీ ఎమ్మెల్యేలు, జిల్లాల నేతలు అనుచరులతో కలిసి ఆయుధాలతో గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను చితక్కొట్టారు. గదిలో దాక్కోవడంతో మామావతి తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఎస్పీ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకోవడం, బీజేపీ, జనతాదళ్ పార్టీల బయటినుంచి మద్దతు ఇవ్వడంతో మాయావతి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment