లక్నో : రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు సమాజ్‌వాదీ పార్టీ ఏర్పాటు చేసిన విందు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేశ్ అగర్వాల్ బీజేపీలో చేరడంతో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు ఎస్పీ నేతలు ఈ విందు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఒకవైపు నిలవడంతో విజయాన్ని సాధించాయి. అందుకే పార్టీలోని విభేదాలను పక్కన బెట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారు.
బుధవారం సాయంత్రం జరగనున్న ఈ విందులో ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌తో పాటు 200 మంది నాయకులు పాల్గొంటరాని పార్టీ నేతలు ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేశ్, ములాయం వర్గాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ విందు ద్వారా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.
కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విందుకు ములాయం, శివపాల్ హాజరయ్యేది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభ ఎన్నికలపై చర్చించడానికి అఖిలేశ్ కాల్ చేసి ఆహ్వానించినా శివపాల్ ఆ సమావేశానికి హాజరుకాలేదు. శివపాల్ ప్రస్తుతం తన సొంత గ్రామానికి వెళ్లడంతో ఆయన సాయంత్రం విందుకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం విందుకు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
మరోవైపు సీఎం యోగి అదిత్యనాథ్ కూడా రాజ్యసభ ఎన్నికల్లో అనుసారించాల్సిన వ్యుహంపై బీజేపీ మిత్ర పక్షాలతో చర్చలు జరుపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment