![Will Support Nitish Kumar If He Quit From NDA Says Asaduddin - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/30/owise.jpg.webp?itok=li-HW7mn)
పట్నా : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాలను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఆదివారం నిర్వహించిన ఓ భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడాలని ఒవైసీ కోరారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ (ఎన్డీయే) కూటమి నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచనా విధానం సరైనది కాదని, దేశాన్ని విభజించాలనే రీతిలో వారి పాలన ఉందని విమర్శించారు. దీనికి నిరసనగా ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటే తాము (ఎంఐఎం) నితీష్‌కు అండగా నిలుస్తామని ఒవైసీ వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీయూకు మద్దతు తెలుపుతామని ప్రకటించారు.
బిహార్‌తో పాటు దేశ వ్యాప్తంగా నితీష్ కుమార్‌కు మంచి గుర్తింపు ఉందని దానిని కాపాడుకోవాలని అసద్ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ భవిష్యత్తు కోసం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన అన్నారు. అలాగే చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతోందని ఆయన గుర్తుచేశారు. నితీష్‌ను బుజ్జగించేందుకు రెండు కేంద్రమంత్రి పదవులు (సహాయ) ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతోందని, వాటికి రాజీపడొద్దని ఒవైసీ కోరారు. కాగా వివాదాస్పద చట్టాలపై ఆందోళనలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో బిహార్‌లో ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తే లేదని నితీష్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment