పట్నా: నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు మరో నాయకుడు పవన్ వర్మను కూడా పార్టీ నుంచి తొలగించింది. కాగా 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అదే విధంగా బిహార్‌లో జేడీయూ అధికారం చేపట్టడం, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కావడానికి ఆయన వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో పీకే.. పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. (అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!)
కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఉపాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఇరు పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సైతం ప్రశాంత్ తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో పార్టీలో కొనసాగాలంటే నిబంధనలు, విధానాలకు లోబడి పనిచేయాలని.. లేనట్లయితే పార్టీని వీడవచ్చంటూ నితీశ్ ప్రశాంత్ కిషోర్‌ను ఉద్దేశించి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక పార్టీ నిర్ణయంపై ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘థాంక్యూ నితీశ్ కుమార్. మీరు మరోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’’అని ట్వీట్ చేశారు. (ప్రశాంత్ కిషోర్, నితీష్ మధ్య బయటపడ్డ విభేదాలు..!)
Thank you @NitishKumar. My best wishes to you to retain the chair of Chief Minister of Bihar. God bless you.🙏🏼
— Prashant Kishor (@PrashantKishor) January 29, 2020
Comments
Please login to add a commentAdd a comment