
పట్నా: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా చెలరేగిన నిరసన సెగలు ఇంకా చల్లారలేదు. ఉత్తర, ఈశాన్య భారతంలో ఆందోళకారులను శాంతిపరచడం రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు స్వరాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. వివాదాస్పద పౌరసత్వ బిల్లుకు నితీష్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు ప్రకటించడంపై ఆ రాష్ట్ర పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా తామంతా నిరసన చేపడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలనతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే ఏమీ పట్టనట్టు సీఎం వ్యవహరిస్తున్నారని, నితీష్ రాష్ట్రంలో ఉన్నారా అంటూ నిలదీస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం అర్థరాత్రి సీఎం నితీష్ మిసింగ్ (మా ముఖ్యమంత్రి కనుబడుటలేదు) అని రాష్ట్ర రాజధాని పట్నాలో పెద్ద ఎత్తున పోస్టర్లను అంటించారు. నితీష్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీనిపై పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు పట్నాలో భారీ ర్యాలీని నిర్వహించిన విషయం తెలిసిందే. చట్టాలనికి మద్దతు ఇవ్వడంపై నితీష్ మరోసారి పునరాలోచించాలని ర్యాలీలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. కాగా ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ క్యాబ్ బిల్లుకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment