
జయప్రకాష్ నారాయణ్
హైదరాబాద్: దేవుడి పెళ్లికి అందరం పెద్దలమేనని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు కోసం ఓ వేదిక ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జేపీతో సుమారు గంటపాటు పవన్‌కల్యాణ్ సమావేశం అయ్యారు. అనంతరం జేపీ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరు ఏరుదాటాక తెప్ప తగలేసిన మాదిరిగా ఉందని విమర్శించారు.
విభజన హామీలను చట్టంలో చేర్చాక, పార్లమెంట్‌లో లోతైన చర్చ జరిగాక కూడా ఇలా వ్యవహరించటం చాలా ప్రమాదకరమైన పరిణామమని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వాలు, పార్టీలు, పార్లమెంట్‌పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. దేశ ప్రధాని, హోంశాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు చట్టంలో లేవని, తమ ఇష్టం అనడం ధర్మం కాదన్నారు.విభజన హామీల అమలుకు సంబంధించి ఏం చేస్తే కేంద్రంలో కదలిక వస్తుందనే అంశాలపై జేపీతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ చెప్పారు.