
శివాజీనగర: ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. సత్తా ఉంటే కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు వారి ఎమ్మెల్యేలను దాచిపెట్టుకోండి’ అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప సవాల్ చేశారు. సోమవారం చించోళి ఎన్నికల సభలో, కల్బుర్గిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫలితాల తరువాత ముఖ్యమంత్రి అవుతానని తాను ఎక్కడా చెప్పలేదు, అయితే ఏమైనా జరగవచ్చు అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ నాయకులకు దమ్ముంటే వారి ఎమ్మెల్యేలు జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలని, అంతేకానీ తమపై లేనిపోని ఆరోపణలు చేయటం ఎందుకని అన్నారు. లోక్‌సభ, శాసనసభా ఉప ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం మనుగడ కష్టమేనని అన్నారు.
సంకీర్ణంలో కలహాలు
మాజీ సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ ధ్వజమెత్తటం వెనుక ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి హస్తముందని యడ్డి ఆరోపించారు. ‘అవి కేవలం విశ్వనాథ్ మాటలు కావు, కుమారస్వామి విశ్వనాథ్ ద్వారా మాట్లాడించారు. విశ్వనాథ్ వ్యాఖ్యలు సంకీర్ణ ప్రభుత్వంలోని నాయకుల మధ్య గొడవ ఏ స్థాయిలో ఉందనేది బహిర్గతమైంది. సర్కారు వారివల్లనే పతనమవుతుంది, అప్పటివరకు వేచి చూస్తాం. సంకీర్ణ కలహాలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. కుమారస్వామి అసమ్మతి వేడిని చల్లార్చుకోవడానికి రిసార్ట్‌కు వెళ్లారు తప్ప విశ్రాంతి కోసం కాదు. చించోళి, కుందగోళ శాసనసభా ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు సాధిస్తారు’ అన్నారు. మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చులకనగా మాట్లాడటమే అలవాటుగా పెట్టుకున్నారని యడ్యూరప్ప విమర్శించారు. ప్రధానిపై మాట్లాడితే పెద్దవారవుతామని అనుకొంటున్నారు, ఓటమి భయంతో ఖర్గే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లు గెలుపొందుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment