గాజువాకలో బేజారైన జనసేన.. వైఎస్సార్‌సీపీపై విష ప్రచారం | Yellow Media Hate Campaign On YSR Congress Party In Gajuwaka | Sakshi
Sakshi News home page

గాజువాకలో బేజారైన జనసేన.. వైఎస్సార్‌సీపీపై విష ప్రచారం

Published Sat, Mar 30 2019 8:56 AM | Last Updated on Sat, Mar 30 2019 9:22 AM

Yellow Media Hate Campaign On YSR Congress Party In Gajuwaka - Sakshi

బీజేపీ ప్రచారంలో పాల్గొన్న పిట్టా నాగేశ్వరరావు (ఫైల్‌)

సాక్షి, గాజువాక : విశాఖ జిల్లా గాజువాక ఎన్నికల ప్రచారంలో దారుణంగా వెనుకబడ్డ జనసేన పార్టీ అక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగిరెడ్డిని ఎదుర్కోలేక ఆయన పార్టీపై బురద జల్లుతూ అడ్డదారులు తొక్కుతోంది. ఇంటి అద్దెను బకాయిపడ్డ ఓ కుటుంబ సమస్యను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముడిపెట్టి ఆ పార్టీని అప్రదిష్టపాల్జేసేందుకు బరితెగించింది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారానికి ఆ కుటుంబంలోని వారు రానన్నారన్న సాకు చెబుతూ ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించడానికి అద్దెకున్న వారిపై దాడిచేసినట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో బీజేపీకి పనిచేసిన ఆ ఇంటి యాజమానికి వైఎస్సార్‌సీపీ నాయకుడనే ముద్రవేసి కుట్ర పన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జేబు సంస్థ అయిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలు వైఎస్సార్‌సీపీపై విష ప్రచారానికి పూనుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఇంటి యజమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఊరు ఊరంతా కదిలివచ్చి యజమాని కుటుంబానికి అండగా నిలిచింది. వైఎస్సార్‌సీపీపై బురదజల్లిన జనసేనను, బురదజల్లిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తీరును వారు ఎండగట్టారు. 

ఇదీ సమస్య..
స్థానికుల కథనం ప్రకారం..నెమలిపురి సిద్ధు, నాగమణి దంపతులు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ నెల్లిముక్కు గ్రామానికి చెందిన పిట్టా నాగేశ్వరరావు ఇంట్లో మూడేళ్ల క్రితం అద్దెకు దిగారు. స్టీల్‌ప్లాంట్‌లో అసంఘటిత కార్మికుడిగా పనిచేస్తున్న సిద్ధు గడిచిన ఎనిమిది నెలలుగా ఇంటి అద్దె సరిగ్గా ఇవ్వడంలేదు. నాగేశ్వరరావు చిన్న కుమారుడికి కొద్ది రోజుల్లో వివాహం.. పెద్ద కోడలికి ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. దీంతో తమకు డబ్బులు అవసరమని, ఇంటి అద్దె ఇవ్వాలని ఇంటి యజమాని కోరారు. తమ కుమారుడికి వివాహం ఉన్నందున ఇల్లు కూడా ఖాళీ చేయాలని చెప్పారు. ఫిబ్రవరి 13న తాము ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్లాల్సి ఉన్నందున ఆ ముందురోజే తమకు ఇంటి అద్దె బకాయి రూ.18వేలను చెల్లించాలని కోరారు. కానీ, వారు చెల్లించలేదు. నాగేశ్వరరావు కుటుంబం యాత్రకు వెళ్లి వచ్చిన తరువాత సిద్ధు భార్య రూ.8వేలను మాత్రమే చెల్లించింది. పైగా తాము ఇంటికి ఏసీ పెట్టుకుంటామని ఇంటి యజమానితో వారు చెప్పారు. ఏసీ కొనడానికి బదులు ఇంటి అద్దె చెల్లించాలని, తమకు ఇల్లు కూడా అవసరం కాబట్టి ఖాళీ చేయాలని ఇంటి యజమాని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న సిద్ధు ఇంటి యజమానిపై గొడవకు వెళ్లాడు. యజమాని భార్య కనకమహాలక్ష్మి గుండెలపై చేయివేసి తోసేశాడు. వెంటనే సిద్ధు భార్య నాగమణి తన భర్తను లాకెళ్తుండగా మెట్లపై జారిపడింది.  
నాగమణి ఉదంతాన్ని వివరిస్తున్న స్థానికులు 

జనసేన మద్దతుతో కుట్ర 
నాటకీయ పరిణామాల మధ్య ఆస్పత్రికలో చేరిన నాగమణిపై స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరిన వెంటనే జనసేన పార్టీ నాయకుడు శివశంకర్‌ ఆమెను పరామర్శించారు. మరోవైపు.. వైఎస్సార్‌సీపీ నాయకుల దౌర్జన్యమంటూ జనసేన పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు, ఆ వెంటనే ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌లు రావడంతో ఈ ఘటన వెనుక ఎవరున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గాజువాకలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేని జనసేన నాయకులు ఈ నీచానికి దిగజారుతున్నారనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. అలాగే, జనసేన పార్టీ నేతల మద్దతుతో ఈ సంఘటన మొత్తాన్ని ఆమె వక్రీకరించిందని, ఏమాత్రం సంబంధంలేని వైఎస్సార్‌సీపీపై కట్టుకథలు అల్లేందుకు ప్రయత్నిస్తోందని స్థానికులు వివరించారు. తనంతట తాను పడిపోయి ఆ నెపాన్ని ఇంటి యజమానిపై మోపుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీకి ఎటువంటి సంబంధంలేని ఒక ఉన్నతాధికారిని పార్టీ పేరుతో రోడ్డుపైకి లాగడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో పోలీసులు నిగ్గు తేల్చాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి. 

నాగేశ్వరరావుకు, వైఎస్సార్‌సీపీకి సంబంధంలేదు 
కాగా, పిట్టా నాగేశ్వరరావుకు, వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధంలేదు. ఆయన స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతంలో పదోన్నతి రావడానికి ముందు బీజేపీలో పనిచేశారు. అనంతరం ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉచిత యోగా క్లాసులు చెప్పడం, సామాజిక అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.  ప్రస్తుతం తన చిన్న కుమారుడి వివాహం ఉన్నందున ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ, నాగేశ్వరరావు తాగి వచ్చి తనను కొట్టాడంటూ నాగమణి ఫిర్యాదు చేయడంపట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఆయన చాలా సౌమ్యుడని, మద్యం అలవాటులేదని తెలిపారు. వీధిలో ఎవరు కనిపించినా అమ్మా అనే సంబోధనతో పలకరించి వెళ్లిపోవడం తప్ప మాట్లాడటం కూడా తాము చూడలేదని మీడియా ప్రతినిధులకు గ్రామస్తులు వివరించారు. 

నేను ఏ పార్టీ వాడినీ కాదు 
వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారానికి నేను పిలిచినట్టు, రానన్నందుకు గొడవైనట్టు రాయడం దుర్మార్గం. నేను గతంలో బీజేపీకి కొద్దికాలం పనిచేశాను. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను. కేవలం నాకు ఇవ్వాల్సిన ఇంటి అద్దెను ఎగ్గొట్టడానికే ఇలాంటి డ్రామాలకు దిగారు. వాళ్లను మా సొంత బిడ్డల్లా చూశాం. డబ్బులు ఎగ్గొట్టడానికి మమ్మల్ని రోడ్డుపైకి లాగారు. 
– పిట్టా నాగేశ్వరరావు, ఇంటి యజమాని 

30 సంవత్సరాలుగా మాకు తెలుసు
మేం విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి వచ్చి ఇక్కడే 30 సంవత్సరాలుగా ఉంటున్నాం. పిట్టా నాగేశ్వరరావు కుటుంబం అప్పట్నుంచీ మాకు చాలా బాగా పరిచయం. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరు.
– నెల్లి రాములమ్మ, స్థానికురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement