
సాక్షి వెబ్ ప్రత్యేకం : రాజ్‌పూత్‌ల కుటుంబంలో జన్మించిన అజయ్ సింగ్ బిస్త్.. గోరఖ్‌పూర్ పీఠాధిపతి స్థాయికి ఎదిగి యోగి ఆదిత్యనాథ్‌గా కీర్తి గడించారు. గణిత శాస్త్రంలో పట్టా పొంది 22 వ ఏటనే కాషాయం ధరించి... కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరొందారు. తదనంతర కాలంలో రాజకీయాల్లో ప్రవేశించి..అనూహ్యంగా దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికై సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కీలకంగా మారిన యూపీలో.. పార్టీ విజయానికై ఆయన ఎటువంటి వ్యూహాలు రచిస్తారో ఇకపై చూడాల్సిందే.
ఫారెస్ట్ రేంజర్ కుమారుడు
ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న పౌరిగడ్వాల్ జిల్లా పాంచుర్‌లో యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న జన్మించారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గల హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. ఆయన తల్లిదండ్రులు ఆనంద సింగ్ బిస్త్- సావిత్రి. ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేసే యోగి తండ్రి ఆనంద్... చిన్ననాటి నుంచే కుమారుడి నాయకత్వ లక్షణాలను గమనించారు. అందుకే సమాజసేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని యోగి చెప్పినపుడు ఆయనకు అండగా నిలిచారు. ఈ క్రమంలో మహంత్ అవైద్యనాథ్ దృష్టిని ఆకర్షించిన యోగి... అంచెలంచెలుగా ఎదిగి 1994లో గోరఖ్‌పూర్ మఠ ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. మహంత్ అవైద్యనాథ్ మరణానంతరం 2014లో గోరఖ్‌పూర్ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
రాజకీయ జీవితం
ఆధ్యాత్మిక సేవలో ఉన్న యోగి 1998లో ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ జీవితం ఆరంభించారు. గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన 12వ లోక్‌సభలో అతిపిన్న వయస్కుడిగా చరిత్రకెక్కారు. ఇక అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు విజయ బావుటా ఎగురవేసి సత్తా చాటారు.
సీఎం స్థాయికి ఎదిగిన వైనం..
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుపొందడంలో యోగి కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ సహా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేవలం తన నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతా పర్యటించి.. మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు బీజేపీ గెలవడంలో ముఖ్య భూమిక పోషించారు. ఇదే హవాను కొనసాగిస్తూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలనాథులు స్పష్టమైన మెజారిటీ దక్కించుకున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా యోగి పేరును తెరపైకి తెచ్చి ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.
సంచలన నిర్ణయాలు- వివాదాలు
హిందుత్వవాదిగా పేరొందిన యోగి హిందూ యువ వాహిని అనే సంస్థను స్థాపించారు. యువ వాహిని కార్యకర్తలు అనేక మత ఘర్షణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే యోగి ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అధికారులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని నిబంధన విధించడం, యాంటీ రోమియో స్క్వాడ్‌తో ఆకతాయిలకు చెక్ పెట్టేలా ప్రణాళికలు రచించడం, కళేబాలు మూయించడం, అదే విధంగా యూపీలోని ముఖ్య పట్టణాల పేర్లు మార్చడం వంటి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే బీజేపీ సర్కారు హయాంలో యూపీలో ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగడం, గోవధ పేరిట మూకహత్యలు జరగడంతో యోగిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగి పట్ల ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని అత్యధిక స్థానాలు గెలవాలని బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు పొత్తుకు సిద్ధపడ్డాయి. చెరో 38 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. దీంతో యూపీలో మరొకసారి కాషాయ పార్టీ అధికారంలోకి రావాలంటే యోగి తీవ్రంగా కృషి చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
ఇష్టాయిష్టాలు
గోశాలలు సందర్శించడం, గోసేవలో నిమగ్నమవడం అంటే యోగికి ఇష్టం. అలాగే రామ మందిర నిర్మాణమే తన ముఖ్య ధ్యేయమని చెప్పే ఆయన పలు ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఆసక్తి కనబరుస్తారు. ఇక సన్యాసి అయిన యోగి సాత్వికాహారమే తీసుకుంటారు.
- యాళ్ల సుష్మారెడ్డి



Comments
Please login to add a commentAdd a comment