సాక్షి, లక్నో : దేశంలోనే అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలకు వారమే గడువుంది. ఢిల్లీని ఆనుకుని ఉన్న ప్రాంతాలతో కూడిన పశ్చిమ యూపీలో తొలిదశ ఓటింగ్ జరగనుంది. కులం, డబ్బు వంటి అంశాలు ఓటింగ్ తీరుతెన్నులను ప్రభావితం చేయడం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ యూపీలో ఈసారి చిన్న పార్టీల ఆవిర్భావం కూడా కీలకం కానుంది. తొలిదశ ఓటింగ్ తరువాతి దశల్లోని పోలింగ్‌ను కూడా ప్రభావితం చేస్తుందా? లేదా? అన్నది ఏప్రిల్ 11 తరువాతే స్పష్టం కానుంది.
యూపీ జనాభా దాదాపు 23 కోట్లు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో దాదాపు 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఫలితంగా చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్నో కొన్ని వేల ఓట్లు కూడగట్టుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ వేల ఓట్లు కాస్తా లక్షల్లోకి చేరితే ఈ చిన్న పార్టీల అభ్యర్థులు తమను తాము కింగ్‌మేకర్లుగా భావిస్తారు.
మూడు చోట్ల ప్రభావం
యూపీలో చిన్న పార్టీల ప్రభావం తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉంటుంది. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఏళ్లుగా పెంచుకున్న రాజకీయ పరపతిని ఎన్నికల సమయంలో వాడుకునేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చిన్న పార్టీల పాత్ర ఏమిటన్న దానిపై లక్నోలో చర్చలు జరగడం కద్దు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన వారు ఏర్పాటు చేసిన పార్టీల గురించి ఇప్పుడు చర్చ ఎక్కువగా జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చిన్నాన్న శివపాల్ యాదవ్ ఏర్పాటు చేసిన ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) ఇలాంటిదే. ఈసారి ఎన్నికల్లో పీఎస్‌పీఎల్ అని పిలుచుకునే ఈ చిన్న పార్టీ పీస్ పార్టీ, అప్నాదళ్ (కృష్ణ పటేల్ వర్గం)తో జట్టుకట్టి మినీ గఠ్‌బంధన్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ కూటమి తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలు, ఓబీసీ ఓటర్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. వీరికి శివపాల్ యాదవ్ అభిమానులూ తోడవడం ఈటావా, ఫిరోజాబాద్, మైన్‌పురి తదితర ప్రాంతాల్లో కీలకం కానుంది.
ములాయంసింగ్ యాదవ్ ముఖ్య అనుచరుడు రాజాభయ్యా ఏర్పాటు చేసిన జనసత్తా పార్టీ ఒకప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి దూరంగా జరిగిపోయారు. కులం, సామాజిక వర్గా ల ఆధారంగా ఈయన తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో తనదైన ప్రభావం చూపగలరు.
నిషాద్.. విషాదమెవరికి?
గోరఖ్‌పూర్ అభ్యర్థి సంజయ్ నిషాద్ ఏర్పాటు చేసిన నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్.. క్లుప్తంగా నిషాద్ పార్టీ విషయం చాలా ఆసక్తికరమైంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానానికి 2018లో ఉప ఎన్నికలు జరగ్గా.. సంజయ్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ గుర్తుతో పోటీ చేసిన సంజయ బీజేపీని ఓడించారు కూడా.
తాజా ఎన్నికల్లోనూ సంజయ్ ఎస్పీ –బీఎస్పీ అభ్యర్థిగానే బరిలోకి దిగుతారని అందరూ అంచనా వేస్తున్న సమయంలో ఆయన పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిపోయారు. దీంతో ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా? ఒకవేళ పోటీ చేస్తే.. ఆయన సామాజిక వర్గం నిషాదులు (పడవ నడిపేవారు) కీలకమవుతారా? అన్నది వేచి చూడాల్సిన అంశం.
వీధి కుక్కలు కాదు.. ఆవులతో సమస్య
ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో అత్యంత ఆసక్తికరమైనది వీధుల్లోని ఆవులు! తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో ఇలా గాలికి వదిలేసిన ఒట్టిపోయిన ఆవులు పెద్ద సమస్యగా మారిపోయాయి. ఒకప్పుడు ఇలా ఒట్టిపోయిన ఆవులను, సంతానోత్పత్తి సామర్థ్యం లేని ఎద్దులను కబేళాలకు తరలించే వారు. గోవధపై నిషేధం కారణంగా ఇప్పుడు ఇవన్నీ వీధుల్లోకి చేరుతున్నాయి.
పాఠశాల ఆవరణల్లో, బహిరంగ ప్రదేశాల్లో.. కొన్నిసార్లు హైవేలపైకి చేరిపోయి చికాకు పెడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గో సంరక్షణ ఆలయాలు ఏమాత్రం సరిపోకపోగా.. పశువులను వదిలించుకోవడం గ్రామీణులకు సమస్యగా మారిపోయింది. చాలా గ్రామాల ప్రజలు ఈ అంశంపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై కూడా ఓటర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాన్పూర్‌లో గంగా నది పొడవునా తోలు పరిశ్రమల మూసివేత ఫలితంగానూ పశువులకు డిమాండ్ తగ్గిపోయింది.
ఇవి మాత్రమే కాదు.. నీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, రహదారులు కూడా కొన్నిచోట్ల ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్రం మొత్తాన్ని చూసినప్పుడు ఇవి చిన్న విషయాలుగానే భావించడం కద్దు. సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, మీరట్, భాగ్‌పట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్ లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లోనైతే వీటి ప్రస్తావన ఉండకపోవచ్చు.
- లక్నో, రతన్ మణిలాల్
Comments
Please login to add a commentAdd a comment