సాక్షి ప్రతినిధి కడప: సార్వత్రిక ఎన్నికల్లో కడప గడపలో రికార్డుల మోత మోగింది. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఘనతను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల అభిమానానికి తగ్గట్లుగా ఆయనకు అత్యధిక మెజార్టీ దక్కింది. వైఎస్ జగన్‌కు 90,110 ఓట్లు ఆధిక్యతను పులివెందుల ప్రజలు కట్టబెట్టారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల్లో జగన్‌దే అత్యధిక మెజార్టీ. వైఎస్సార్ జిల్లాలో కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అంజాద్‌బాషా, డాక్టర్ సుధీర్‌రెడ్డి 52వేలు పైగా మెజార్టీని దక్కించుకొని మరో రికార్డు సాధించారు. అన్నకు తగ్గ తమ్ముడిగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి 3.54 లక్షల ఓట్ల ఆధిక్యతను సొంతం చేసుకున్నారు.
ఆల్‌టైం రికార్డు వైఎస్ కుటుంబం సొంతం
పులివెందుల నియోజకవర్గంలో ఆల్‌టైం రికార్డు వైఎస్ కుటుంబం సొంతమని మరోమారు నిరూపితమైంది. దివంగత వైఎస్‌ఆర్ పులివెందుల అభ్యర్థిగా 1985లో 30వేలు పైచిలుకు మెజార్టీ సాధించి అప్పట్లో అబ్బరపర్చారు. ఆ తర్వాత 1989లో వైఎస్ వివేకానందరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి 47,746 ఓట్లు మెజార్టీ సొంతం చేసుకొని తన అన్న రికార్డును మించిపోయారు. 1991 ఉప ఎన్నికల్లో పోటీచేసిన డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి 97,448 ఓట్లు మెజార్టీ సాధించారు. 2009లో ముఖ్యమంత్రి హోదాలో పోటీచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 68,681 ఓట్లు మెజార్టీ కైవసం చేసుకున్నారు. కాగా వైఎస్సార్ సీఎంగా రెండోసారి ప్రమాణశ్వీకారం చేసిన అనతికాలంలోనే దివంగతులు కావడంతో.. ఆ తర్వాత ఉప ఎన్నికలల్లో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2011లో పోటీచేసిన వైఎస్ విజయమ్మ తన భర్త వైఎస్సార్ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువగా.. 81,333 ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. తాజాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల ప్రజానీకం మనస్సులను చూరగొని రికార్డు స్థాయిలో 90,110 ఓట్లు మెజార్టీ దక్కించుకున్నారు.
త్యాగానికి ప్రతిఫలం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి వైఎస్ అవినాష్‌రెడ్డి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో 3.54 లక్షలు ఓట్లు మెజార్టీ సాధించారు. భారతదేశంలో అత్యధిక మెజార్టీ సాధించిన నేతల సరసన వైఎస్ అవినాష్‌రెడ్డిని కడప ప్రజలు నిలిపారు. అదేరీతిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి 2.64లక్షల మెజార్టీ కట్టబెట్టారు. పదవీత్యాగానికి ప్రతిఫలంగా వైఎస్సార్ జిల్లా ప్రజలు గతంలో లభించిన మెజార్టీ కంటే అత్యధికంగా అప్పగించడం విశేషం. కాగా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన వారి సరసన కడప ఎమ్మెల్యేగా అంజాద్‌భాషా, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్‌రెడ్డి నిలుస్తున్నారు. కడపలో 52,539 ఓట్లు మెజార్టీ సాధించగా, జమ్మలమడుగులో 52,035 ఓట్లు మెజార్టీ స్వంతమైంది. ఇప్పటివరకూ కడపలో 10కి 10సీట్లు సాధించిన చరిత్రలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రికార్డు కూడా సొంతమైంది. వెరశి కడప గడపలో రికార్డుల మోత మోగింది.
కడప గడపలో రికార్డుల మోత
Published Fri, May 24 2019 6:39 AM | Last Updated on Fri, May 24 2019 7:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment