
పాలకొల్లు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : నాటకం, సినీ రంగాలకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాలకొల్లు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని మార్చిందని అన్నారు. రేలంగి, చలం, చిరంజీవి లాంటి గొప్పవారు పాలకొల్లు నుంచే వచ్చారని గుర్తు చేశారు. ఎన్నో వైభవాలకు నెలవైన డెల్టా ప్రాంతం చంద్రబాబు పాలన మొదలెట్టాక కరువుతో అల్లాడిపోతోందని అన్నారు.
‘పాలకొల్లులో శ్రీరామ స్వామి వారు స్వయంగా నెలకొల్పిన పంచారామ క్షేత్రం ఉంది. డచ్ వారి నుంచి బ్రిటీష్ హయాం వరకూ పాలకొల్లు పలు విధాలుగా అభివృద్ధి చెందింది. అలాంటి పాలకొల్లు నుంచి ఉపాధి కోసం ప్రజలు వలసపోతున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు అవినీతి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇదే జిల్లా చంద్రబాబుకు 15కు 15 స్థానాలను ఇచ్చింది. మరి ఆయన ఈ జిల్లాకు, పాలకొల్లు నియోజకవర్గానికి చేసిందేమిటి?. ఇక్కడి ఎమ్మెల్యేలకు చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చారు. మట్టి, ఇసుక, కొల్లేరు, మనం వనం పేరుతో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు.
దేవుడిని సైతం ఖాతరు చేయకుండా పుష్కరాల్లో దోపిడి చేశారు. పుష్కరాల్లో ఇదే పాలకొల్లు ప్రాంతంలో 350 కోట్ల నాసిరకం పనులు చేశారు. పుష్కరాలు పూర్తికాగానే వాటి ఆనవాళ్లు లేకుండా పోయాయి. వనం మనం పేరుతో ఒక్కో మొక్కకు రూ. వెయ్యి చొప్పున ప్రజల నుంచి వసూలు చేశారని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లులు పెట్టుకుని వసూలు చేశారని ప్రజలు నాతో వాపోయారు.
చంద్రబాబు అడుగుపెట్టిన తర్వాత నాలుగేళ్లలో డెల్టా కూడా కరువు కోరల్లో చిక్కుకుంది. వంతులు వారీగా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది. క్యాన్ తాగునీరు కొనడానికి రూ. 20 నుంచి రూ.40 ఖర్చు చేస్తున్నామని వాపోతున్నారు. పేదవాడి ఇళ్ల మీద కూడా అవినీతి చేసేవారు ఎవరున్నారన్న చంద్రబాబు తప్ప అని అడుగుతున్నారు.
3,500లకు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు వైఎస్సార్ ఇచ్చారు. ఆయన వెళ్లిన తర్వాత ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని చంద్రబాబు లాక్కున్నారని ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ఇలా ఉన్నాయి. 300 అడుగుల ఫ్లాట్ ఇస్తాను అన్నాడు. అడుగుకు 2200 చొప్పున ఆరున్నర లక్షలట. పేదవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లి ఒక ఫ్లాట్‌ను కట్టడానికి ఎంత అవుతుందని అడిగితే రేటు కట్టడానికి అడుగుకు రూ. వెయ్యి దాటదని బిల్డర్లు చెబుతున్నారు.
మూడు లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయట బాగానే ఉంది. మిగిలిన మూడు లక్షలు పేదవాడు ఇరవై ఏళ్ల పాటు చెల్లించాలట. లంచాలు తీసుకునేది చంద్రం.. వాటిని పేదవాడు కట్టుకుంటూటూటూ.... పోవాలట. చంద్రబాబు ఇలాంటి ఫ్లాట్లు ఏవైనా పంపకం చేస్తే బంగారంలా తీసుకోండి. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఫ్లాట్ల మీద రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నా.
మానవత్వం లేని, అన్యాయం చేసే పరిపాలను చంద్రబాబు హయాంలో చూస్తున్నాం. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబో రోజుకో కొత్త సినిమా, కథ చెబుతున్నారు. రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లు ఉన్నాయి. 10 లక్షల మందికి కేవలం వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు జాబు వచ్చింది. ఇప్పటికి 48 నెలలు అయింది. ప్రతి కుటుంబానికి 96 వేలు బాకీ పడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని 10 లక్షల మందికి వెయ్యి రూపాయలు ఇస్తారట. అదికూడా కేవలం ఆరు నెలలు అట.
ఎన్నికల తర్వాత చంద్రబాబు మళ్లీ పెద్ద పంగనామం పెడతాడు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ నుంచి ఇలాంటి నాయకులు బయటకు వెళ్లాలి. ఇలా జరగాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అనే పదాలు వస్తాయి.
పొరబాటున కూడా ఈ రాజకీయ వ్యవస్థను క్షమించకూడదు. రేపొద్దున ఈ వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. ఎన్నికల ప్రచారంలో అన్ని నేను చేశాను అంటాడు. ఇప్పుడు మళ్లీ నన్ను ఎన్నుకోండి. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. నమ్మరని తెలిసి బోనస్‌గా బెంజ్ కారు ఇస్తానంటాడు. మూడు వేలు డబ్బు ఇస్తే వద్దు అని మాత్రం అనొద్దు. ఐదు వేలు కావాలని గుంజండి.
ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లోంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేప్పుడు మాత్రం మీ మనస్సాక్షిని నమ్మి ఓటేయండి. అబద్దాలు చెప్పేవాళ్లను మోసం చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలపండి. దేవుడి ఆశీర్వదించి మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ నవరత్నాలు ద్వారా చెప్పాం.
సీపీఎస్ అని ఉద్యోగులు అడుగుతున్నారు. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి హామీ ఇస్తున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లోగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే తొలి పని ఇదే. నాలుగేళ్లలో చంద్రబాబు ఉద్యోగాలు కల్పించడానికి చేసిన ప్రయత్నాలు శూన్యం. ప్రత్యేక హోదాను వెక్కిరిస్తూ చంద్రబాబు మాట్లాడారు.
హోదా వల్లే ఉద్యోగాల విప్లవాన్ని సృష్టించగల్గుతాం. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీరు ఏ పార్టీని మీరు నమ్మొద్దు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను అసలు నమ్మొద్దు. రేపొద్దున 25 మంది ఎంపీలను వైఎస్సార్ సీపీకి ఇవ్వండి. కేంద్రంలో ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్లకే మద్దతు ఇస్తాం అని చెబుతున్నా. ముందే మాటలు అవసరం లేదు. పొత్తులు అవసరం లేదు. ప్రత్యేక హోద సంతకం పెట్టు ఆ తర్వాతే మద్దతు ఇస్తాం అని కేంద్రాన్ని డిమాండ్ చేస్తాం.
ప్రత్యేక హోదా వస్తే జీఎస్టీ, ట్యాక్స్‌లు కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత పారిశ్రామిక వేత్తలు మన రాష్ట్రానికి క్యూ కడతారు. ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ప్రాజెక్టుల కడుతున్నారు. కానీ మనకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మనం అధికారంలోకి వచ్చిన తొలి శాసనసభలోనే ఈ మేరకు చట్టాన్ని తెస్తాం. ప్రతి పరిశ్రమలోనూ 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనను చేరుస్తాం. దీనివల్ల ఉన్న పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు కూడా స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాయి.
ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాలు రావు. కాంట్రాక్టులు, ఔట్ సోర్సింగ్‌లో ఉన్న ఉద్యోగులను ఎడాపెడా పీకేస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. మనం చేయబోయే ఇంకో కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం’ అని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment