నీ పాత్ర లేకుంటే సీబీఐకి ఎందుకివ్వవు? | YS Jagan complains to Governor about YS Viveka Murder Case | Sakshi
Sakshi News home page

నీ పాత్ర లేకుంటే సీబీఐకి ఎందుకివ్వవు?

Published Sun, Mar 17 2019 4:05 AM | Last Updated on Sun, Mar 17 2019 3:19 PM

YS Jagan complains to Governor about YS Viveka Murder Case - Sakshi

హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌. చిత్రంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు తదితరులు

హత్యకు గురైన మా చిన్నాన్న వివేకానందరెడ్డి సామాన్యుడేమీ కాదు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. మాజీ మంత్రి కూడా.. అలాంటి వ్యక్తికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి?
– వైఎస్‌ జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. చంద్రబాబు తీరు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రికి తాబేదార్లుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అడిషినల్‌ డీజీ వంటి అధికారుల విచారణతో తమకు న్యాయం జరగదని తేల్చిచెప్పారు. అలాంటి అధికారులను రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య, తదనంతర పరిణామాలపై గవర్నర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము డిమాండ్‌ చేసినట్టు ఒకటి రెండు రోజుల్లో సీబీఐ విచారణకు అంగీకరించకపోతే కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  
 
‘‘హత్యకు గురైన మా చిన్నాన్న వివేకానందరెడ్డి సామాన్యుడేమీ కాదు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తమ్ముడు, మాజీ మంత్రి. అలాంటి వ్యక్తికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? వివేకానందరెడ్డి హత్య విషయంలో సీబీఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సీఎం చంద్రబాబుకు సమాచారం అందించే అధికారులతో విచారణ చేయిస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? అని గవర్నర్‌ను అడిగాం. మేము అక్కడ (పులివెందులలో) ఎస్పీతో, ఐజీతో మాట్లాడుతుండగానే ఇంటెలిజెన్స్‌ ఏడీజీ నుంచి ఫోన్లు వస్తున్నట్టు ఫోన్‌లో కనిపించింది. దీన్నిబట్టి చూస్తుంటే ఇంటెలిజెన్స్‌ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఈ విషయంలో ఎంత లోతుగా దిగి పర్యవేక్షిస్తున్నారో అర్థమవుతోంది. ఆయన వెంటవెంటనే ఫోన్లు చేయడమే ఇందుకు నిదర్శనం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను చంద్రబాబు తన వాచ్‌మెన్‌ డిపార్ట్‌మెంట్‌గా మార్చుకున్నారు.

ఇంటెలిజెన్స్‌ సిబ్బంది గ్రామాల్లో సర్వేలు చేసి, వైఎస్సార్‌సీపీ వాళ్లు ఎవరు? నాయకులు ఎవరు? వాళ్లు ఎన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు? వాళ్లను ఎలా ప్రలోభపెట్టాలి? అనేదానిపై చంద్రబాబుకు రిపోర్టు ఇస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను, రాష్ట్రంలో నక్సల్స్‌ కార్యకలాపాలో, మరేదైనా జరగడానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన ఇంటెలిజెన్స్‌ అధికారులను చంద్రబాబు తన వాచ్‌మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈవేళ వైఎస్సార్‌సీపీ నుంచో, ఇంకొకరి నుంచో నాయకులను ప్రలోభపెట్టి చంద్రబాబు పక్షాన చేర్చే విషయంలో ముందుంటున్నారు.

మా పార్టీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు మా పార్టీ ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు తరఫున మాట్లాడారు. ఆయనతోపాటు ఆంధ్రజ్యోతి పేపర్‌ యజమాని రాధాకృష్ణ నేరుగా మా వాళ్లను పిలిపించుకుని మాట్లాడి, చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి కండువాలు కప్పించారు. ఇంతటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోంది. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావు నిన్న నేను డీఐజీతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ల మీద ఫోన్లు చేశారంటే ఇక మాకు ఎలా న్యాయం జరుగుతుంది?  
 
జమ్మలమడుగు ఇన్‌చార్జీగా ఉండడమే పాపమా?  
చిన్నాన్న వివేకానందరెడ్డి చేసిన తప్పేమిటి? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌చార్జీగా వ్యవహరించడమా? ఆ నియోజకవర్గంలో ఇంతకుముందు మా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అమ్ముడుపోయారు. చంద్రబాబు ఆయనను ప్రలోభపెట్టి తీసుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చారు. జమ్మలమడుగులో యువకుడైన మా అభ్యర్థి సుధీర్‌రెడ్డిని తీసుకొచ్చాం. చిన్నాన్న చేసిన పాపమల్లా జమ్మలమడుగు ఇన్‌చార్జీగా ఆ నియోజకవర్గంలో ఎక్కువగా తిరగడం. ఆ పాపానికి వీళ్లు(టీడీపీ పెద్దలు) చేసిందేమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేశారు. ఇది ధర్మమేనా?   
 
బాబూ.. ఎందుకు సంకోచిస్తున్నారు?  

చంద్రబాబులో నిజంగా న్యాయమే ఉంటే, ఆయనకు ఈ హత్య కేసులో ఎలాంటి పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు సంకోచిస్తున్నారు? ఆయన ఏ తప్పూ చేయకపోతే భయమెందుకు? చిన్నాన్న హత్యపై కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అడిషినల్‌ డీజీ వంటి వ్యక్తులను రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. అలాగైతేనే కాస్తోకూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. లేకుంటే ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు లాంటి వాళ్లు ఏమైనా చేస్తారు. ఇప్పటికే దొంగ ఓట్లను చేరుస్తున్నారు. ఉన్న వాటిని తీసివేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మనుషులను చంపేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటువంటి అధికారులు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగవని గవర్నర్‌కు చెప్పాం. వివేకానందరెడ్డి హత్యపై ఒకటి రెండు రోజుల్లో సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించకపోతే కోర్టుకు వెళతాం. సీబీఐ లేదా తృతీయ పక్ష విచారణ జరగాలి. అది కూడా చంద్రబాబు ఆధీనంలోని లేని అధికారులతో జరగాలని కోరుతున్నాం.  
 
ప్రభుత్వం ఎప్పుడూ భద్రత కల్పించలేదు  
చిన్నాన్నకు సెక్యూరిటీ కూడా లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఆయనకు భద్రత కల్పించలేదు. దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా చంద్రబాబు మాటలు ఉన్నాయి. వాళ్లే హత్య చేయిస్తారు, వాళ్లే ఇతరులపై బురదజల్లుతారు. అన్ని వేళ్లూ చంద్రబాబు వైపు చూపుతున్నాయి. ఇదేదో ఇప్పుడే మొదలైంది కాదు. గతంలో మా తాత రాజారెడ్డిని చంపారు. అప్పట్లో మానాన్న ప్రతిపక్ష నాయకుడు. ఆయనను కడపకే పరిమితం చేయడానికి మా తాతను అతి దారుణంగా చంపేశారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. సాక్షాత్తూ ప్రతిపక్ష నేత తండ్రిని హత్యం చేశారు. మానాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోవడానికి రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 31న చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు.. నువ్వు (వైఎస్సార్‌) అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాడు. ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు బెదిరించాడు.

ఇది జరిగిన రెండు రోజులకే హెలికాప్టర్‌ ప్రమాదం నాన్న మృతి చెందాడు. ఇప్పటికీ మాకు సందేహాలున్నాయి. ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబే. అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించే విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో నాపై హత్యాయత్నం జరిగింది. విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చింది? నాపై హత్యాయత్నం చేసిన వ్యక్తి  విమానాశ్రయంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి రెస్టారెంట్‌లో పని చేస్తున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబే. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. అంటే అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపుతున్నాయి. ఇప్పుడు మా చిన్నాన్నను హత్య చేశారు. కడప జిల్లాలో చంద్రబాబు పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. అందుకే రాజకీయాల్లో గెలవడం కోసమని ఏ స్థాయికి దిగజారిపోయారో చూశాం. మళ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబే. అలాంటి వ్యక్తి తానే విచారణ జరుపుతా అంటున్నాడు. అలాంటప్పుడు న్యాయం జరుగుతుందా? చంద్రబాబుకు సంబంధం లేని థర్డ్‌ పార్టీతో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుంది.  
 
నా మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు  
చంద్రబాబు ఈ పని (వివేకానందరెడ్డి హత్య) చేసి నా మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నాడు. కానీ, అది సాధ్యం కాదు. నేను ఒకటే చెబుతున్నా. పైన దేవుడున్నాడు. ఆయన చూస్తున్నాడు. రాక్షసత్వం ఒక స్థాయి దాటిపోయినప్పుడు కచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.   
 
సహజ మరణంగా చిత్రీకరించేందుకు కుట్ర  
ఇంటెలిజెన్స్‌ ఏడీ నాయకత్వంలో ఎస్‌ఆర్‌సీ (భద్రతా సమీక్షా కమిటీ) ఉంటుంది. ప్రజాప్రతినిధులకు, ముఖ్యనేతలకు రక్షణ కల్పించాలి. కానీ, ఇక్కడ మాత్రం అది జరగలేదు. ఏదైనా జిల్లాకు ఒక ఎస్పీని నియమిస్తే రెండేళ్లపాటు ఆయనను బదిలీ చేయకూడదు. ఈ మేరకు జీవోలు కూడా ఉన్నాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో అలా జరగలేదు. కడప జిల్లాకు నియమించిన ఎస్పీ రెండేళ్ల పాటు ఉండాల్సి ఉండగా, 40 రోజుల్లోనే బదిలీ అయ్యారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సహాయం చేస్తాడన్న నమ్మకం లేక ఆయనను తీసేసి, కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. వీటన్నింటినీ చూస్తే కుట్ర అన్పించదా? నిన్న ఎస్పీ, డీఐజీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు నాకొక లేఖ చూపించారు. ఆ లేఖను మా చిన్నాన్న రాశాడట. ‘నా డ్రైవర్‌ నన్ను కొట్టి చంపాడు’ అని మా చిన్నాన్న రాశాడట. ఎంత దారుణం ఈ లేఖ? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా సృష్టించారంటే.. అదేదో చిన్నాన్న రక్తం కక్కుకుని చనిపోయాడన్న భావన వచ్చేలా.. పక్కనే ఒక చోట రక్తం ఉంది.. ఆ తర్వాత చిన్నాన్న బాత్రూమ్‌లోకి పోయినట్టుగా బాడీ అక్కడ పడి ఉంది. బాత్రూమ్‌లో కమోడ్‌కు రక్తం పూశారు. అంటే రక్తస్రావం ఎక్కువగా జరిగినందువల్ల తల తిరిగి (గిడ్డీనెస్‌) బాత్రూమ్‌లో కుప్పకూలినట్టుగా, అలా కుప్పకూలుతున్నప్పుడు తల కమోడ్‌కు కొట్టుకుందన్నట్టుగా దానికి రక్తం పూశారు.

తల కమోడ్‌కు కొట్టుకుని వెనక్కు పడిపోయినట్టుగా శవాన్ని పెట్టారు. అంటే పకడ్బందీగా మనిషిని తల వెనుక భాగాన కొట్టి, బెడ్‌రూమ్‌లోనూ కొట్టి చంపి బాత్రూమ్‌లో పెట్టి, ఇది సహజ మరణంగా చిత్రీకరించేందుకు కుట్ర జరిగింది. తనను చంపుతూ ఉండగానే చిన్నాన్న లేఖ రాస్తారా? వీళ్లు ఒకపక్క చంపుతా ఉంటే రక్తం కారుతున్న సమయంలోనే ఆయన లెటర్‌ రాస్తూ ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు ఆ లేఖపై రక్తపు మరకల్ని పూశారు. చిన్నాన్న చనిపోతూ నా డ్రైవర్‌ నన్ను చంపుతున్నాడు, కొడుతున్నాడు అని వాళ్ల ముందే రాస్తాడా? ఇవన్నీ ఏం చెబుతున్నాయి? వీటికి ఎక్కడైనా పొంతన ఉందా? వాస్తవాలను తప్పుదోవ పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, కొత్త కొత్త కథలు సృష్టించారు. వాళ్లు ఎన్నయినా కాకమ్మ కథలు, సినిమా కథలు చెప్పనివ్వండి. నా ప్రశ్న ఒక్కటే.. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు నిజంగా ప్రమేయం లేకపోతే ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసిన వారిలో జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, పీవీ మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement