
చంద్రబాబు తాజా సినిమా ‘ఆరో బడ్జెట్’ ఫ్లాప్ అయిందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
సాక్షి, కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సినిమా ‘ఆరో బడ్జెట్’ ఫ్లాప్ అయిందంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ‍్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన గురువారం మాట్లాడుతూ... తనది కాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి అన్నం పెట్టనివాడు... చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. బడ్జెట్ మాత్రమే కాదని, అన్ని విషయాల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కడప జిల్లా తమకు ఎంతో ఇచ్చిందన‍్న వైఎస్ జగన్...ఉక్కు ఫ్యాక్టరీ కట్టించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో శంకుస్థాపన చేసి, మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. (అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు: వైఎస్ జగన్)
వైఎస్ జగన్ మాట‍్లాడుతూ.. ‘రాజధాని కట్టడు..కట్టినట్లు బిల్డప్ ఇస్తాడు. ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తానని పాదయాత్రలో చెప్పాను. దాన్నే చంద్రబాబు ఖాకీ చొక్కా వేసుకుని కాపీ కొట్టాడు. 2013లో బీసీల కోసం 119 హామీలు ఇచ్చాడు. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్‌తో మోసం చేశాడు. 57 నెలలు కడుపు మాడ్చి... చివరి మూడు నెలలు అన్నం పెడతాననే వాడిని ఎలా నమ్మలి. చంద్రబాబును అన్న అనాలా? దున్నా అనాలా?’ అని ధ్వజమెత్తారు. (చంద్రబాబు కుయుక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి)