సాక్షి, కర్నూలు: చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏమాత్రం మారలేదని.. ఆయన మాత్రం దేశంలో అత్యంత ధనిక సీఎం అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం అత్యంత ధనికుడని, కానీ రాష్ట్రంలోని రైతులు మాత్రం అత్యంత పేదలుగా మిగిలిపోయారని అన్నారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్రానికి చెందిన రైతులపైనే ఉందని వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషి ఇప్పటివరకూ ఏ ఒక్క సీఎం కూడా చేయలేదని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడి అరాచక పాలనను అంతంచేసి.. రాజన్న రాజ్యం తీసుకువస్తామని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని.. ప్రత్యేక హోదాను ముందుగా ప్రకటించిన వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూర్‌లో జరిగిన సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నందికొట్కూర్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న తొగురు ఆర్థర్‌ని, ఎంపీ అభ్యర్థి బ్రహ్మనందరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హమీలను ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కటీ కూడా అమలుచేయ్యలేదు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఉన్న ఉద్యోగాలు తీయించారు. సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు తొలగించారు. ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోభృతి ఇస్తామన్నారు. కానీ 57 నెలల మోసం చేసి.. ఎన్నికలకు చివరి మూడునెలలు భృతి ఇస్తామని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయని, మన బతుకులు మారుతాయని ఎంతో ఆశపడ్డం. కానీ ఇంతవరకు దాని ఊసేలేదు.
స్థానికలకే 75శాతం ఉద్యోగాలు
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి.. ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. తొలిఏడాదే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. రాష్ట్రాంలోని పరిశ్రమల్లో ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అన్ని పరిశ్రమల్లో స్థానికలకే 75శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా శాసనసభలో చట్టం చేస్తాం. ఉద్యోగాలన్ని మన పిల్లలకే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కాంట్రాక్టులకు కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు వచ్చే విధంగా చట్టం చేస్తాం. ఐదేళ్ల కాలంలో ఆయన చేయని మోసం లేదు, ఆడని డ్రామాలేదు, అబద్ధంలేదు, చూపని సినిమా లేదు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మరోసారి కుట్ర చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటుకు మూడు వేల రూపాయలు పంచుతున్నాడు. అక్రమంగా గెలవడానికి మూటల మూటల డబ్బు పంపుతా ఉన్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలి.
వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం
డ్వాక్రా మహిళను ఆదుకుంటాం. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి.వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటా.. పిల్లల్ని బడికి పంపితే చాలు ఏడాదికి 15వేలు చేతిలో పెడతాం. పేద పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పెద్దపెద్ద చదువులను చదవిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొదుపు రుణాలను మాఫీ చేస్తాం. మళ్లీ రాజన్న రాజ్యం వచ్చే విధంగా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తాం. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి 75వేలు చేతిలో పెడతాం. పెట్టుబడి కోసం ప్రతి రైతుకు ఏడాదికి 15వేలు ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తాం. పెన్షన్లు పెంచుతాం. పేదలకు ఇళ్లు కట్టిస్తాం. నవరత్నాల ద్వార పేదల బతుకుల్లో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది’’ అని అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment