ఏపీకి హైకోర్టు అవసరం లేదని జీవో తెస్తారేమో: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Public Meeting In Kurupam | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 20 2018 6:00 PM | Last Updated on Tue, Nov 20 2018 8:03 PM

YS Jagan Mohan Reddy Public Meeting In Kurupam - Sakshi

సాక్షి, కురుపాం : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల బాధలు, వారి సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పోరాటం చేస్తానంటూ భేటీలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి పక్క రాష్ట్ర నేతలతో భేటీలవుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్‌ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇచ్చేస్తారని ఎద్దేవా చేశారు. 302 రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాలన తీరును చీల్చి చెండాడారు.

తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకున్నారా?
‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొన్న చంద్రబాబు కురుపాం ఎమ్మెల్యే పుష్పవాణినిని ప్రలోభపెట్టారు. కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు పుష్పవాణి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయంలోనే కురుపాం అభివృద్ధి చెందింది. ఎందరికో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కానీ చంద్రబాబు పాలనలో ఊరికి నాలుగైదు ఇళ్లను కూడా ఇవ్వలేదు. వైఎస్సార్‌ సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టించారు. ఆయన హయంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేద’ని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. 

చంద్రబాబే దళారులను ప్రొత్సహిస్తున్నారు
‘రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ప్రకటించలేదు. కనీసం కొనగోలు కేంద్రాలను కూడా తెరువడం లేదు. పంట మొత్తం దళారుల చేతికి వెళ్లాక కొనుగోలు కేంద్రాలను తెరుస్తారు. అప్పడు తెరిస్తే ఎవరికి లాభం? రైతులకు ఏమైనా లాభం ఉటుందా? రైతుల దగ్గర తక్కువ ధరలకు కొని హెరిటేజ్‌లో నాలుగు, ఐదు రెట్ల ఎక్కువకు అమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడే దళారులకు ప్రోత్సహిస్తున్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామంటారు. నెలకు మూడు, నాలుగు వందల రూపాయలు ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. వట్టిగడ్డ ద్వారా 17వేల ఎకరాలకు నీరందించాల్సింది ఉండగా..కనీసం 10వేల ఎకరాలకు కూడా నీరు రావడం లేదు. 470 కరువు మండలాలు కాస్తా 520కి పెరిగాయి. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2 వేలకోట్లు ఇవ్వాల్సి ఉండగా కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’ అని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

విచారణ చేయమని రాష్ట్రపతిని ఎందుకు కోరలేదు
ఈ మధ్య గరుడ పక్షి అని మీరు వినే ఉంటారు. ఆపరేషన్‌ గరుడ అంటూ చంద్రబాబు యాగీ చేస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందకు పెద్ద కుట్ర జరుగుతుందని, దాని వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారని  చంద్రబాబు టీవీలల్లో చెప్పుతున్నారు. చాలా సార్లు ఈ పెద్దమనిషి (చంద్రబాబు) ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. మరి ఎందుకు ఆపరేషన్‌ గరుడపై  విచారణ చేయాలని రాష్ట్ర పతిని కోరలేదు. ఇదే అంశంపై ఎందుకు సుప్రీం కోర్టులో కేసు వేయలేదు. ఎందుకు వెయ్యలేదంటే..కేసు వేస్తే చంద్రబాబు నాయుడు దొరికి పోతారు. ఎన్నిక వేల రాష్ట్రంలో ఈడీ, ఐటీ సోదాలు జరగకూడదట. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్‌ ఇస్తే.. మనకు హైకోర్టు కూడా అవసరం లేదని చంద్రబాబు అంటారు. ఏపీ వ్యవహారాలు సుప్రీం కోర్టు పరిధిలోని రావని జీవో తెచ్చిన తెస్తారు. ప్రత్యేక హోదా కోసం కోర్టుకు పోరు కానీ.. అవినీతిపరులను కాపాడేందుకు అవసరమైతే కోర్టుకు పోతారట. ఏపీలో ఇలాంటి అన్యాయమైన పాలన చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

అవినీతి రాజ్యమేలుతోంది
‘చంద్రబాబు పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. రాజధాని, విశాఖ భూములు, మట్టి, ఇసుకను కూడా వదలడంలేదు. చివరికి ఆలయ భూములను కూడా దోచుకుంటున్నారు. కరెంట్‌ బిల్లు, పెట్రోల్‌ రేట్లు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే.. బాదుడు. స్కూళ్ల, కాలేజీల ఫీజులు పెంచేశారు. ఫీజురియంబర్స్‌మెంట్‌ పాతరేశారు. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏమి రావడంలేదు. అది కూడా వేలి ముద్రలు రావడం లేదని కోత పెడుతున్నారు. పాఠశాలలు, ఆలయాల పక్కన మద్యం షాపులు నడిపిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను పధకం ప్రకారం తగ్గిస్తున్నారు. అత్యంత విలువైన హాయ్‌లాండ్ భూములు చంద్రబాబు లాక్కుని అది అగ్రోగోల్డ్ ది కాదని చెబుతున్నారు. అగ్రిగోల్ట్‌ బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మోసం చేస్తోంది. విలువైన ఆస్తులను చంద్రబాబు, ఆయన బినామీలు కాజేస్తున్నారు. ఇలాంటి అవినీతి పాలకులు అవసరమా మీరు ఒక్క సారి ఆలోచించాలి’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు.

మీ బిడ్డలను నేను చదివిస్తా
రాష్ట్రంలో లంచాలు లేనిదే ఏ పని జరగడం లేదు. అలాంటి పరిస్థితిని తొలగించాలి. రేపు పొద్దున దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేయబోతున్నానో నవరత్నాల్లో చెప్పేశాను. అవన్నీ చెప్పితే సమయం సరిపోదు కనక కొన్ని వివరిస్తాను. మన ఆడవాళ్లకోసం ఏం చేయబోతున్నానను అనేది ఈ మీటింగ్‌లో చెప్పుతా. నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు ఆడ వారు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం అని. ఆడవారు లక్షలధికారులు కావాలి అని చెప్పేవారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ప్రతి అక్కా..చెల్లికి చెప్పుతున్నా ఎన్నికల నాటికి డ్వాక్రామహిళలకు ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. పిల్లలకు బడులకు పంపిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. పేదవాడు అప్పులపాలు కాకుండా చదువుకునే పరిస్థితి లేదు. ప్రతి అక్కకు హామి ఇస్తున్నా మీ పిల్లను నేను చదివిస్తా. ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలంటే లక్షలు ఖర్చులు పెట్టాలి. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అక్కా చెల్లెలమ్మలకు ‘వైఎస్సార్‌ చేయుత’ పథకాన్ని తీసుకొస్తాం. కార్పొరేషన్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయుత అమలు చేస్తాం.  ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. గ్రామ సచివాలయంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. ఫీజు రియంబర్స్‌ మెంట్‌ 72 గంటల్లో మంజూరు చేస్తాం. అవ్వా, తాతలకు వైఎస్‌ భరోసా కింద ఫించన్‌ను రూ.2వేలు పెంచుతాం. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇస్తాం. ఇళ్లులు కట్టించడమే కాదు ఆ ఇళ్లులను అక్కా చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం. చివరిగా ప్రతి అక్కకు హామీ ఇస్తున్నా.. 2019లో ఎన్నికలు ఉంటాయి. మళ్లీ 2024లో ఎన్నికలు వస్తాయి. మీ అందరి దయతో 2019లో మనం ప్రభుత్వం ఏర్పాటు అయితే ఐదు ఏళ్ల తర్వాత అంటే 2024 ఎన్నికలనాటికి మందు షాపులు అనేవి లేకుండా చేసి ఓట్లు అడుగుతా అని హామీ ఇస్తున్నాను. ఇంకా ఏం చేయబోతున్నానో మరిన్ని సభలల్లో తెలియజేస్తాను. మీ బిడ్డను ఆశ్వీరదించాల్సిందిగా కోరకుంటూ సెలవు తీసుకుంటున్నాను’ అని వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement