
సాక్షి, తరిమెల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను తరిమెల నాగిరెడ్డి చూసి ఉంటే ఏం చేసేవారో అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబులాంటి నాయకుడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తరిమెల నాగిరెడ్డిని ప్రజలు నేటికి మర్చిపోలేరని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెన్నా నది మీదుగా తరిమెల గ్రామానికి వంతెన కావాలని అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టారు.
'తరిమెల గ్రామం రాజకీయంగా చైతన్యవంతమైనది.. ఈ గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మట్టి నుంచి పెద్దపెద్ద నాయకులు వచ్చారు. తరిమెల నాగిరెడ్డిని నేటికి మర్చిపోలేరు. నాలుగేళ్లలో చంద్రబాబు పాలన చూశాక మనం ఇక్కడ ఏకమయ్యాం. నాలుగేళ్లుగా చంద్రబాబుది అబద్ధాల, మోసాల పాలన, న్యాయం ధర్మం లేని పరిపాలన. రాజధాని దగ్గర నుంచి గుడి భూముల వరకు, ఇసుక నుంచి మట్టి వరకు, చంద్రబాబు దగ్గర నుంచి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల స్థాయి వరకు అంతటా అవినీతి కూరుకుపోయింది. గ్రామాల్లో పెన్షన్‌కు, బియ్యానికి, మరుగుదొడ్లకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు చంద్రబాబు ఏం మాటలు చెప్పారో ఓసారి నాలుగేళ్లు వెనక్కు వెళ్లి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఇలాంటి వ్యక్తిని(చంద్రబాబును) చూశాక మనకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించుకోవాలి. అధికారంలోకి రాకమునుపు కరెంట్ బిల్లులు తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు ఏంచేశారు? నాలుగేళ్ల కిందట కరెంట్ బిల్లు రూ.50 లేదా అసలు వచ్చేదే కాదు.. కానీ, బాబు పాలనలో కరెంటు బిల్లు రూ.500, రూ.1000 వరకు వస్తోంది. నాడు రేషన్ షాపుల్లో బియ్యంతోపాటు నిత్యవసర సరుకులు అన్ని దొరికేవి. కానీ, ఇప్పుడు మాత్రం రేషన్ షాపులో బియ్యం తప్ప ఏమీ దొరకని పరిస్థితి ఉంది. ఆ బియ్యం కూడా ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే ఇద్దరికైనా కటింగ్ పెడుతున్నారు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు.. జాబు లేని యువతకు నెలకు రూ.2000 ఇస్తానని చెప్పారు. ఆ చొప్పున ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.90 వేలు బాకీ పడ్డారు. అధికారంలోకి రావడం కోసం బ్యాంకుల్లో పెట్టిన మహిళల బంగారం ఇప్పిస్తానని మోసం చేశారు'
Comments
Please login to add a commentAdd a comment